సీఎం జగన్‌ సంక్షేమాన్ని గుంట నక్కలు తట్టుకోలేకపోతున్నాయ్‌: సజ్జల

30 May, 2023 11:02 IST|Sakshi

సాక్షి, గుంటూరు: సమసమాజాన్ని నిర్మించే పనిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని, అభివృద్ధి.. సంక్షేమం అంటే ఏంటో చేసి చూపించారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కొనియాడారు. నేటికి(మంగళవారం, మే 30 2023) సీఎంగా వైఎస్‌ జగన్‌ పాలన నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఈ తరుణంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు నిర్వహించగా.. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో సజ్జల పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరణ, కేక్‌ కట్టింగ్‌ నిర్వహించారు. 

ఈ నాలుగేళ్లలో అభివృద్ధి, సంక్షేమం అంటే ఏంటో సీఎం జగన్‌ చేతల్లో చూపించారని, దీనిని కొన్ని  గుంట నక్కలు తట్టుకోలేకపోతున్నాయని సజ్జల చెప్పుకొచ్చారు. జగన్‌ ఏం అభివృద్ధి, సంక్షేమం తెచ్చారో ప్రజలకు తెలుసు. యాభై శాతం ఫలాలు మహిళల పేరుతోనే అందుతున్నాయి. కానీ, జనాల్ని మోసం చేయడానికి చంద్రబాబు మళ్లీ వస్తున్నాడు.దత్తపుత్రుడితో కలిసి ఎన్నికలకు పోవాలని చూస్తున్నాడు.  

‘‘కళ్లార్పకుండా చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారు. 2014-2019 మధ్య చంద్రబాబు ఏం చేశాడో ప్రజలు మర్చిపోలేదు. అన్న క్యాంటిన్ పేరుతో ఎంత దోచుకున్నారో అందరికీ తెలుసు. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేశానని ఈరోజు చంద్రబాబు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు?. మరుగుదొడ్ల నిర్మాణంలో కూడా కిట్ బ్యాగులు తీసుకున్నాడు. ఇప్పుడు అమ్మ ఒడిని కాపీ కొట్టి.. అమ్మకు వందనం పేరుతో వస్తానంటున్నాడు. ప్రజలు నమ్మరని కూడా ఆయనకు తెలుసు. కానీ అబద్దాల హోరులో ప్రజలని మభ్య పెట్టాలని చూస్తున్నారు. దొంగదెబ్బ తీసి పార్టీని ఆక్రమించిన చంద్రబాబు ప్రజలకు మేలు చేస్తాడని అనుకోవద్దు అని ఏపీ ప్రజానికాన్ని ఉద్దేశించి సజ్జల పిలుపు ఇచ్చారు. 

రాజశేఖర్ రెడ్డి అంశ జగన్. ఆయన పేరును నిలపెట్టే విధంగా ప్రజలకు సంక్షేమాన్ని అందించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలంతా జగన్ కుటుంబ సభ్యులే. ఏ ఎన్నికలు వచ్చినా జగన్‌ను ప్రజలు ఆదరించటానికి కారణం అదే. చరిత్ర మనకి ఒక అవకాశం ఇచ్చింది. హామీలు అమలు చేస్తున్నందునే మనం జనంలోకి ధైర్యంగా వెళ్లగలుగుతున్నాం. కానీ, పొత్తులతో పాచికలు వేయాలని చంద్రబాబు చూస్తున్నారు. ఏపీ ప్రజలే కాదు.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది అంటూ సజ్జల పేర్కొన్నారు.

ఇదీ చదవండి: చెప్పుకోవడానికి చంద్రబాబుకు ఏముంది? 

మరిన్ని వార్తలు