బీజేపీలోనే రాజకీయ వారసులెక్కువ..

23 Sep, 2021 04:31 IST|Sakshi

388 మంది బీజీపీ ఎంపీల్లో 45 మంది వారసులే

లిస్టు విడుదల చేసిన కాంగ్రెస్‌ ఎంపీ రిపున్‌ బోరా

గువాహటి/న్యూఢిల్లీ: కాంగ్రెస్‌వి వారసత్వ రాజకీయాలంటూ విమర్శించే బీజేపీలోనే అత్యధిక వారసత్వ కుటుంబాలున్నాయంటూ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. పార్లమెంటు ఇరు సభల్లో కలిపి ఉన్న బీజేపీకి ఉన్న 388 మంది ఎంపీల్లో 45 మంది వారసత్వ రాజకీయాల ద్వారానే పదవులు చేపట్టారని, వీరిలో కేంద్ర మంత్రులు కూడా ఉన్నారని అస్సాం రాజ్యసభ ఎంపీ రిపున్‌ బోరా బుధవారం స్పష్టం చేశారు. ఆయా వారసత్వ  నాయకుల కుటుంబాల లిస్టును అయన విడుదల చేశారు. కాంగ్రెస్‌పై బురదజల్లే హక్కు బీజేపీకి లేదని మండిపడ్డారు. బీజేపీలో ఉన్నంత మంది వారసత్వ ఎంపీలు కాంగ్రెస్‌లో లేరని అన్నారు. బీజేపీలోగానీ, బీజేపీ సంకీర్ణంలో ఉన్న ప్రభుత్వంలోగానీ కలిపి మొత్తం 27 కుటుంబాలు చాలా కాలం నుంచి అధికారంలో ఉన్నాయని, కాంగ్రెస్‌లో అంత కాలం పాటు వారసత్వాలు నడిపిన నాయకులు లేరని చెప్పారు.

లిస్టులో కేంద్ర మంత్రులు..
రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కుమారుడు పంకజ్‌ సింగ్‌ ఉత్తరప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా ఉన్నారని రిపున్‌ బొరా చెప్పారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులైన అనురాగ్‌ ఠాకూర్, పీయూశ్‌ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్‌లు మాజీ ముఖ్యమంత్రుల/కేంద్ర మంత్రుల కుమారులని పేర్కొన్నారు. ఇలాంటి ఉదాహరణలు లోక్‌సభలోనే 18 ఉన్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో ఇలా ఇద్దరు ముగ్గురు ఉన్నప్పటికీ వారు ప్రజలు ఆమోదించడం, వారికున్న శక్తి సామర్థ్యాల కారణంగా వచ్చారని వ్యాఖ్యానించారు.

పదవులే కావాలనుకుంటే..
గాంధీ కుటుంబానికి పదవులే కావాలనుకుంటే 2004లో కాంగ్రెస్‌ ఆధిక్యం పొందినప్పుడు ప్రధానిగా సోనియా గాంధీనే నియమితులయ్యేవారని రిపున్‌ చెప్పారు. కానీ ఆ సమయంలో పగ్గాలను మన్మోహన్‌ సింగ్‌కు అప్పగించారని గుర్తు చేశారు. రాహుల్‌ గాంధీని కేంద్ర మంత్రిగా చేసుకోవా లనుకుంటే పరిస్థితులు అనుకూలించేవని, కానీ వారు అలా చేయలేదని చెప్పారు. కాంగ్రెస్‌ నుంచి ఆరుగురు ప్రధాన మంత్రులుగా పనిచేయగా, అందులో ముగ్గురు మాత్రమే గాంధీల కుటుంబం నుంచి వచ్చారని, మరో ముగ్గురు గాంధీ కుటుంబానికి చెందని వారని కాంగ్రెస్‌ ఎంపీ రిపున్‌ బోరా గుర్తు చేశారు. 

మరిన్ని వార్తలు