50 మంది ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధం.. బండి సంజయ్‌ వ్యాఖ్యలు

14 Aug, 2022 02:08 IST|Sakshi

సాక్షి, యాదాద్రి: రాష్ట్రంలో 50 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. శనివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ప్రజాసంగ్రామయాత్ర సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీలకు ఇంతవరకు అధికారం ఇచ్చారని, ఇప్పుడు బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.

అధికారం కోసం కేసీఆర్‌ ఇంట్లో పంచాయతీ నడుస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్షా 80 వేల కోట్లు ఖర్చుపెట్టి తన ఫాంహౌస్‌కు నీళ్లు తెచ్చుకున్న సీఎం.. యాదాద్రి జిల్లాలోని బునాదిగాని కాలువకు బస్వాపూర్‌ ప్రాజెక్టును అనుసంధానం చేయడానికి రూ.100 కోట్లు కేటాయించడం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రశ్నిస్తే బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారన్నారు. తుంగతుర్తిలో ఇసుక మాఫియాను అడ్డుకున్న వారిని జైలుకు పంపించారన్నారు. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ గెలుపును కేసీఆర్‌ ఆపలేడన్నారు. ఉప ఎన్నిక వస్తేనే తుంగతుర్తిలో అభివృద్ధి జరుగుతుందన్నారు. వీఆర్‌ఏల సమస్యలను 20 రోజులుగా పరిష్కరించడం లేదన్నారు. కేసీఆర్‌ బస్‌చార్జీలు, కరెంట్‌ బిల్లులు విపరీతంగా పెంచారని మండిపడ్డారు. దళితబంధు ఎంతమందికిచ్చారని ప్రశ్నించారు.

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ.. తుంగతుర్తి నియోజకవర్గంలో గాదరి కిషోర్‌ను, టీఆర్‌ఎస్‌ పార్టీనీ ఓడిస్తేనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. అనంతరం రిటైర్డ్‌ ఏసీపీ బొట్టు కృష్ణ సహా వివిధ పార్టీలకు చెందిన వారు బండి సంజయ్‌ సమక్షంలో బీజేపీలో చేరారు.
చదవండి: ‘నా రాజీనామా తర్వాత మునుగోడులో ఎన్నో మార్పులు’

మరిన్ని వార్తలు