కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. ఆజాద్‌కు మద్దతుగా 5వేల మంది కార్యకర్తల రాజీనామా!

1 Sep, 2022 17:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌తో 50 ఏళ్ల అనుబంధాన‍్ని తెంచుకుని సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసింది. ఆయన నిష్క్రమణతో కాంగ్రెస్‌ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. హస్తం పార్టీకి దేశవ్యాప్తంగా గడ్డు పరిస్థితులు ఎదురయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్‌ నేతలు పార్టీని వీడారు. తాజాగా గులాం నబీ ఆజాద్‌కు మద్దతుగా దేశవ్యాప్తంగా సుమారు 5000 మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 

జమ్ముకశ్మీర్‌ సహా పలు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది కార్యకర్తలు గురువారమే తమ రాజీనామాలను అందించనున్నట్లు తెలిసింది. ఆజాద్‌కు మద్దతు తెలుపుతున్నట్లు అధిష్టానానికి తెలియజేయటమే దీని ముఖ్య ఉద్దేశంగా స్పష్టమవుతోంది. కొద్ది నెలల్లోనే గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల జరగనున్న వేళ కాంగ్రెస్‌కు అతిపెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. మరోవైపు.. జమ్ముకశ్మీర్‌ ఎన్నికలు సైతం 2023లో జరగనున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో కార్యకర్తల రాజీనామా ఒక్కటే కాదు.. ఇటీవల సీనియర్‌ నేత భూపేందర్‌ సింగ్‌ హుడా, ఆజాద్‌ల భేటీ హరియాణా కాంగ్రెస్‌లో కలకలం సృష్టిస్తోంది. గురువారం ఆజాద్‌తో భేటీ అయిన వారిలో ఆనంద్‌ శర్మ, భూపింద్‌ సింగ్‌ హుడా, పృథ్విరాజ్‌ చావన్‌లు ఉన్నారు. దీంతో గాంధీ కుటుంబానికి, పార్టీకి విదేయతపై ఇతర పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇదీ చదవండి: కశ్మీర్ లోయలో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ.. ఆజాద్ వెంటే కార్యకర్తలంతా!

మరిన్ని వార్తలు