రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం.. 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా

26 Sep, 2022 12:53 IST|Sakshi

జైపూర్: రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్‌లో సంక్షోభం తలెత్తింది. 92 మంది ఎమ్మెల్యేలు ఆదివారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషికి నివాసానికి వెళ్లి అందజేశారు. దీంతో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు పార్టీలో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి.

అయితే రాజీనామా చేసిన వారంతా సీఎం అశోక్ గహ్లోత్ మద్దతుదారులు. గహ్లోత్ కాంగ్రెస్ అధ్యక్షుడైతే రాజస్థాన్‌ తదపురి సీఎంగా సచిన్ పైలట్‌ను నియమించడాన్ని  వీరంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన పైలట్‌కు సీఎం పదవి కట్టబెట్టడం ఏంటని వీరంతా ప్రశ్నిస్తున్నారు. రాజస్థాన్ తదుపరి సీఎం కూడా అశోక్ గహ్లోత్‌ వర్గానికి చెందిన వారే కావాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆదివారం సాయంత్రం కేబినెట్ మంత్రి శాంతి ధరివాల్ నివాసంలో గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలంతా భేటీ అయ్యారు. అనంతరం ఓ బస్సు ఎమ్మెల్యేలతో స్పీకర్ జోషి నివాసానికి వెళ్లింది. ఆ తర్వాత వారంతా రాజీనామాలు సమర్పించారు.

ఎమ్మెల్యేలంతా ఆగ్రహంతో ఉన్నారని, అందుకే రాజీనామా చేశారని అసమ్మతి వర్గంలో ఒకరైన ప్రతాప్ సింగ్ తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని తమను సంప్రదించకుండా అశోక్ గహ్లోత్‌ నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. సీఎల్పీ సమావేశానికి ముందు ఈ పరిణామాలు జరగడం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని షాక్‌కు గురిచేశాయి. గహ్లోత వర్గానికి చెందిన సీపీ జోషి లేదా పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దొటాస్రా కొత్త సీఎంగా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు ప్రతాప్ సింగ్ చెప్పారు. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో మాట్లాడతామన్నారు.
చదవండి: రాజస్థాన్ సీఎం పదవికి అశోక్ గహ్లోత్ రాజీనామా!

మరిన్ని వార్తలు