మతిలేని మాటలతో విద్వేషమా?

29 Nov, 2020 08:35 IST|Sakshi

ఎన్నికలప్పుడే పాకిస్తాన్, ముస్లిం అంశాలు గుర్తుకొస్తాయా? 

భాషాపరమైన మైనార్టీల సమావేశంలో మంత్రి కేటీఆర్‌  

జూబ్లీహిల్స్‌(హైదరాబాద్‌): ఎన్నికలప్పుడే కొన్ని పార్టీలకు పాకిస్తాన్, ముస్లిం అంశాలు గుర్తుకొస్తాయని, ఒక నాయకుడు సర్జికల్‌ స్రై్టక్‌ చేస్తామని మతిలేని మాటలు మాట్లాడుతూ సమాజంలో విద్వేషం నింపుతున్నారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కేవలం అభివృద్ధి, మౌలిక వసతులపై ప్రచారం చేస్తోందన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీలకు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. బేగంపేట హరితాప్లాజాలో శుక్రవారం భాషాపరమైన మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని తమ ప్రభుత్వం అమలుచేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం సాధించిందేంటని, రూ.20 లక్షల కోట్లతో కరోనా ప్యాకేజి ప్రకటిస్తే, కనీసం ఒక్కరూ దీనితో లబ్ధిపొందిన దాఖలా లేదన్నారు. నష్టాల్లో ఉన్న ఎయిర్‌ ఇండియాను అమ్మివేయడం సరే కాని లాభాల్లో ఉన్న ఎల్‌ఐసీని ఎవరి కోసం అమ్మేస్తున్నారని ప్రశ్నించారు. (విజ్ఞతతో ఆలోచించండి.. మోసపోవద్దు)

నేడు తెలంగాణా ఏది చేస్తే రేపు దేశమంతా అదే అనుసరిస్తుందని, రైతుబంధు, మిషన్‌ భగీరథ, టీఎస్‌ ఐపాస్, టీఎస్‌ బీపాస్‌ సహ ఎన్నో సంస్కరణలతో దేశానికి ఆదర్శంగా నిలిచిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ఆరేళ్ల క్రితం పుట్టిన తెలంగాణ రాష్ట్రం.. ఒక విజయవంతమైన స్టార్టప్‌ సంస్థగా అభివర్ణించారు. నిరంతరం మంచినీరు, 24 గంటల విద్యుత్‌ అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. నగరానికి గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్‌ తదితర బడా కంపెనీలు భారీ పెట్టుబడులతో వస్తున్నాయని, సమర్థవంతమైన నాయకుడు, స్థిరమైన ప్రభుత్వంతోనే ఇది సాధ్యమైందన్నారు. విభిన్న సంస్కృతులు, ఘనమైన చరిత్ర కలిగిన హైదరాబాద్‌ నగరాన్ని మరింత ముందుకుతీసుకెళ్లడానికి, కొత్త రహదారులు, కొత్త దవాఖానాలు, కొత్త మౌలిక వసతుల ఏర్పాటుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. 

గత ఐదేళ్లలో రూ.67 వేల కోట్లను నగరాభివృద్ధికి వెచి్చంచామని, మెట్రో సహ ఎన్నో పథకాలు తెచ్చామన్నారు. ప్రగతిశీల ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలు, పథకాలకు ప్రతిఒక్కరు మద్దతుగా నిలవాలని కోరారు. విద్యావంతులు ట్వీట్లు ఎక్కువ చేస్తూ ఓట్లు వేయడం లేదని, ప్రతిఒక్కరు ఓటువేసి సమర్థులను ఎన్నుకొని ప్రగతిశీల ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. నగరంలో యూనిటీ టవర్‌ నిర్మాణానికి, బెంగాలీ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించడానికి కృషిచేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్రమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ నిర్వాహకులు అభిజిత్, బీనా, కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.

కూల్చడమే తప్ప నిర్మించడం చేతకాదా?
అమీర్‌పేట: అభివృద్ధి మాట మరిచిపోయి.. ఎన్నికలను దేశద్రోహులు, దేశభక్తుల మధ్య పోటీగా అభివరి్ణంచడం ఏమిటని కేటీఆర్‌ ప్రశ్నించారు. అమీర్‌పేట గ్రీన్‌పార్క్‌ మ్యారీగోల్డ్‌ హోటల్‌లో శనివారం అగర్వాల్, మహేశ్వరి, మార్వాడి, గుజరాతీ వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. కేటీఆర్‌ మాట్లాడుతూ బీజేపీ, ఎంఐఎం నేతలు తమ గొడవలతో నగర వాతావరణాన్ని చెడగొడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ‘ఒకరేమో ఎనీ్టఆర్, పీవీ సమాధులు కూలుస్తామంటే, మరొకరు దారుస్సలాం కూలుస్తామంటున్నారు. కూల్చడమే తప్ప నిర్మించడం మీకు చేతకాదా’అని ప్రశ్నించారు. గడిచిన ఆరేళ్లలో నగరంతో పాటు తెలంగాణ ప్రజలు రెండు లక్షల 72 వేల కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లించారని, తిరిగి కేంద్రం ఇచ్చింది కేవలం లక్షా 40 కోట్లేనని తెలిపారు. సామాన్యులు, వ్యాపారులు, అన్ని వర్గాల ప్రజల కోసం తమ ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేసిందని చెప్పారు. ఇది గుర్తించి తమను ఆశీర్వదించాలని కోరారు. 

మరిన్ని వార్తలు