10 లక్షల ఉద్యోగాలు : తేజస్వీ యాదవ్

17 Oct, 2020 14:29 IST|Sakshi

ప్రత్యేక హోదా ఇవ్వాలంటే అమెరికానుంచి  ట్రంప్ దిగి రానక్కర్లేదు : తేజస్వీ యాదవ్

అచ్చమైన బిహారీని,  స్వచ్ఛమైన డీఎన్ఏ నాది

‘మహాఘట్ బంధన్’ కూటమి  మేనిఫెస్టో

10 లక్షల  ఉద్యోగాలు

బడ్జెట్ లో 12 శాతం విద్యకు

అనేక స్మార్ట్ పథకాలు

సాక్షి, పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ప్రధానంగా రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ)నేత, బిహార్‌ ప్రతిపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ కేంద్రం, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగి రావాల్సిన అవసరం లేదంటూ మండిపడ్డారు. తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ‘మహాఘట్ బంధన్’ కూటమి మేనిఫెస్టోను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా పలు హామీలను గుప్పించారు. ముఖ్యంగా తమ కూటమి అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగాలు,  ప్రత్యేక హోదా తీసుకొస్తామని హామీ ఇచ్చారు. తాను స్వచ్ఛమైన బిహారీని అని తన డీఎన్ఏ స్వచ్ఛమైందని  తేజస్వీ వ్యాఖ్యానించారు.

మూడు దశల్లో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల గ్రాండ్ అలయన్స్ మ్యానిఫెస్టోను తేజస్వీ యాదవ్ శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నితీష్ ప్రభుత్వంపై తన దాడిని ఎక్కుపెట్టారు. నితీశ్ ది డబుల్ ఇంజిన్ ప్రభుత్వమని, గత15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా, ప్రయోజనమేమీలేదని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి అధికార దాహం తప్ప ప్రజల సంక్షేమంపై దృష్టి లేదంటూ ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఫారాలు ఉచితం చేస్తా మన్నారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లే అభ్యర్థుల ప్రయాణ ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందన్నారు. అలాగే బడ్జెట్ లో 12 శాతం విద్యకు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన వాగ్దానాలను తుంగలోకి తొక్కారని, ఇది రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమని ఆరోపించారు. మోతియారి షుగర్ మిల్లులో కప్పు టీ తాగుతానని చెప్పిన ప్రధాని, రాష్ట్రంలో వరుసగా చక్కెర మిల్లులు, జనపనార మిల్లులు, పేపర్‌మిల్లులు, రైస్ మిల్లులను మూసివేసారని దుయ్యబట్టారు. నితీష్ కుమార్ నాయకత్వంలోని, ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కనీసం 60 స్కాంలు జరిగాయని, నేరాలు పెరిగి పోయాయని వ్యాఖ్యానించారు.

ఈ ఎన్నికలలో అతి ముఖ్యమైన అంశం నిరుద్యోగమని పేర్కొన్న తేజస్వి ఉపాధి,ఉద్యోగాలు కోల్పోయిలన ప్రజలు ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజలు చాలా కోపంగా ఉన్నారన్నారు. వ్యాపారాలు నాశనమై పోయినా, వరదలతో రాష్ట్రంలో అనేక ప్రాంతాలు దెబ్బతింటే, ఇప్పటి వరకూ కేంద్రం పర్యటించిన పాపాన పోలేదని తేజస్వీ మండి పడ్డారు. అంతేకాదు ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, మాధ్యమిక పాఠశాలల్లో 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉంటారని ప్రకటించారు. దీంతోపాటు, ‘స్మార్ట్ గ్రామ యోజన’ కింద ప్రతి పంచాయతీలో డాక్టర్, నర్సులతో క్లినిక్స్, దీంతోపాటు ప్రాన్ హమారా, సంకల్ప్ బద్లావ్ కా లాంటి పథకాలను మ్యానిఫెస్టోలో ప్రకటించారు. కాంగ్రెస్ నాయకులు రణదీప్ సురేజ్‌వాలా, శక్తిసింహ్ గోహిల్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కాగా 243 సీట్ల రాష్ట్ర అసెంబ్లీ అక్టోబర్ 28 నుంచి మూడు దశల్లో ఎన్నిలు జరగనున్నాయి. నవంబర్ 10న ఫలితాలు ప్రకటించనున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు