పోలీసులుంది ప్రజలకు భద్రత కల్పించడానికి.. మోదీకి బ్యానర్లు కట్టడానికి కాదు

24 Jul, 2022 20:27 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించాల్సిన ఓ కార్యక్రమాన్ని కేంద్రం హైజాక్ చేసిందని ఆరోపించారు ఆప్ నేత, ఢిల్లీ మంత్రి  గోపాల్ రాయ్‌. రాత్రికి రాత్రే పోలీసులు రంగంలోకి దిగి స్టేజీపై నరేంద్ర మోదీ పోస్టర్లు ఏర్పాటు చేశారని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వ కార్యక్రమాన్ని కాస్తా.. రాజకీయ కార్యక్రమంగా మార్చారని విమర్శించారు. ఈమేరకు మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

'కేజ్రీవాల్ ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సం కార్యక్రమం ఆదివారంతో ముగుస్తుంది. ఈ  సందర్భంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్‌  హాజరుకావాల్సి ఉంది. కానీ ఏమైందో తెలియదు.  శనివారం రాత్రి అనూహ్యంగా ప్రధాని కార్యాలయం ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగి స్టేజీపై మొత్తం మోదీ పోస్టర్లు ఏర్పాటు చేశారు. వాటిని తొలగిస్తే అరెస్టు చేస్తామని బెదిరించారు.' అని గోపాల్ రాయ్ పేర్కొన్నారు. పోలీసులు ఉంది ప్రజలకు భద్రత కల్పించడానికి గానీ, ప్రధాని మోదీ కోసం బ్యానర్లు కట్టేందుకు కాదని ధ్వజమెత్తారు.

ఢిల్లీ ప్రభుత్వాన్ని కేంద్రం అప్రతిష్ఠపాలు చేయాలని చూస్తోందని ఆరోపించారు గోపాల్ రాయ్‌. ఇప్పటికే తమ నేత సత్యేంద్ర జైన్‌పై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై కూడా కుట్ర జరుగుతోందని అన్నారు.  సీఎం కేజ్రీవాల్ సింగపూర్ పర్యటనకు వెళ్లకుండా అధికారిక ప్రక్రియ నిలివేశారని విమర్శించారు.
చదవండి: 'ఆ రెస్టారెంట్‌ స్మృతి ఇరానీ కూతురిదే.. ఇదిగో సాక్ష్యం' 

మరిన్ని వార్తలు