గెలిస్తే ఉచితంగా 300 యూనిట్ల కరెంట్‌

17 Sep, 2021 03:55 IST|Sakshi

యూపీ ఎన్నికలపై ఆప్‌ దృష్టి

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే విద్యుత్‌ గృహ వినియోగదారులకు 300 యూనిట్ల ఉచిత కరెంట్‌ అందిస్తామని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రకటించింది. గురువారం లక్నోలో ఆప్‌ యూపీ ఇన్‌ఛార్జి సంజయ్‌ సింగ్‌తో కలిసి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా మీడియాతో మాట్లాడారు. బీజేపీ హయాంలో గృహ అవసరాల నిమిత్తం 300 యూనిట్ల విద్యుత్తుకు రూ.1,900 చెల్లిస్తున్నారని అదే ఆప్‌ ప్రభుత్వం వస్తే ఏమీ చెల్లించనవసరం లేదని స్పష్టం చేశారు. యూపీలో గెలిస్తే అధిక కరెంట్‌ బిల్లులతో సతమతమవుతోన్న 48 లక్షల కుటుంబాల విద్యుత్‌ బిల్లులను రద్దుచేస్తామన్నారు.

రైతులకు ఉచితంగా కరెంట్‌ ఇస్తామని, పాత బకాయిలు మాఫీ చేస్తామని సిసోడియా పేర్కొన్నారు. ఇదే తరహా హామీని ఇప్పటికే ఆప్‌ పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాల్లోనూ ఇచ్చింది. యూపీలోని మొత్తం 403 స్థానాల్లో పోటీకి దిగుతామని ఆప్‌ గతంలోనే స్పష్టంచేసింది. ఢిల్లీలో విజయవంతం అయిన విద్యుత్తు ఫార్మూలాను 2017లో పంజాబ్‌ ఎన్నికల్లో ప్రయోగించి అత్యధిక స్థానాలు పొందిన రెండో పార్టీగా ఆప్‌ నిలిచింది. ఈ సారి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌ల్లోనూ తమదైన ముద్ర వేయాలని ఏడాది నుంచే పార్టీ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఈ నెల మొదటి వారంలో వివిధ సర్వేలు పంజాబ్‌లో ఆప్‌ గణనీయమైన పురోగతి సాధిస్తుందని పేర్కొనడంతో పార్టీని పక్క రాష్ట్రాలకు విస్తరించడానికి సరైన తరుణమని కేజ్రీవాల్‌ భావించారు. ఉత్తరప్రదేశ్‌లాంటి పెద్ద రాష్ట్రంలో పార్టీని ప్రజల్లోకి తీసుకురావాలంటే ఛరిష్మా ఉన్న అగ్రనేత తప్పనిసరి. ఇటు అధికార బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ పునాదులు బలంగా ఉండడంతో ఢిల్లీ విద్యుత్‌ ఫార్మూలానే యూపీలోనే ప్రయోగించాలని ఆప్‌ విశ్వసిస్తోంది. కరోనా నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ గ్రామీణ ప్రాంతాల్లో 95 శాతం మంది ఆదాయం పడిపోయిందని ఓ సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా తరలివెళ్లిన వలస కార్మికులు కరోనా వల్ల తిరిగి రావడమూ ఓ కారణమని సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో విద్యుత్తు ఫార్మూలా యూపీలో ప్రభావం చూపుతుందని ఆప్‌ భావిస్తోంది.

మరిన్ని వార్తలు