ఆప్‌కు అధికారమిస్తే.. గుజరాతీలకు కేజ్రీవాల్‌ బంపరాఫర్‌

2 Sep, 2022 19:08 IST|Sakshi

అహ్మదాబాద్‌: పంజాబ్‌ విజయం ఇచ్చిన స్ఫూర్తితో..  మిగతా రాష్ట్రాల్లోనూ అసెం‍బ్లీ ఎన్నికల పోటీకి ఫుల్‌జోష్‌తో ఆమ్‌ ఆద్మీ పార్టీ సై అంటోంది. ఈ క్రమంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పదే పదే పర్యటిస్తూ వస్తున్నారు ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌. తాజాగా బీజేపీ కంచుకోటగా భావించే గుజరాత్‌లో అధికారం కోసం గుజరాతీలపై హామీల జల్లు కురిపించారు ఆయన.  

గుజరాత్‌లో గనుక అధికారమిస్తే.. రైతులకు రూ.2 లక్షల దాకా రుణమాఫీ చేస్తామని ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. రెండు రోజల గుజరాత్‌ పర్యటనలో భాగంగా.. ద్వారక జిల్లాలో ఆయన ఇవాళ పర్యటించి ప్రసంగించారు. పగటి పూట 12 గంటలపాటు ఉచిత విద్యుత్‌తో పాటు కనీస మద్దతు ధరతో పంట కొనుగోలు, పంట నష్టపోతే ఎకరాకు రూ.20వేల పరిహారం ప్రభుత్వం తరపున చెల్లింపు లాంటి హామీలను రైతుల కోసం ప్రకటించారు ఆప్‌ కన్వీనర్‌.

అంతేకాదు.. ప్రస్తుతం గుజరాత్‌లో అమలులో ఉన్న భూ సర్వే బిల్లును రద్దు చేసి.. కొత్త బిల్లు తీసుకొస్తామని, నర్మదా డ్యామ్‌ కమాండ్‌ ఏరియాను విస్తరించి రాష్ట్రం ప్రతిమూలలా ప్రయోజనాలు కలిగేలా చూస్తామని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. గుజరాత్‌ గత ప్రభుత్వాలన్నీ రైతులను నిర్లక్ష్యం చేశాయని.. సమస్యలను లేవనెత్తేందుకు తాను సిద్ధమని పేర్కొన్నారు. 

ఆప్‌ వయసు పదేళ్లు. అలాంటి పార్టీ అద్భుతాలు ఎలా చేస్తుందని అడుగుతున్నారు. అది పేదల ఆశీర్వాదంతో ముందుకు వెళ్లడం వల్లే సాధ్యమవుతోందని కేజ్రీవాల్‌ తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌లను టార్గెట్‌ చేస్తూ.. ‘ఉచిత విద్యుత్‌, విద్య కావాలంటే మాకు ఓటేయండి. అవినీతి, గుండాయిజం కావాలనుకుంటే వాళ్లకు ఓటేయండి’ అని ఆయన ప్రసంగించారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గత కొన్ని నెలలుగా పదే పదే పర్యటిస్తున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. ఎన్నికల ముందస్తు హామీలను కురిపిస్తున్నారు. ఉచిత విద్యుత్(పరిమిత యూనిట్ల వరకు)‌, విద్య, ఆరోగ్య సదుపాయాలతో పాటు లక్షల్లో ఉద్యోగాలు, మహిళలకు అలవెన్స్‌లు లాంటి వరాలను ప్రకటిస్తూ వస్తున్నారు.

ఇదీ చదవండి: అవినీతిపరుల కోసం ఒక్కటవుతున్నారు.. ప్రధాని మోదీ

మరిన్ని వార్తలు