ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25కోట్ల ఆఫర్‌! బలపరీక్షకు సీఎం సై.. జర్మనీ నుంచి వీడియో సందేశం

19 Sep, 2022 16:52 IST|Sakshi

చండీగఢ్‌: ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ నెల మొదట్లో ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి బలం నిరూపించుకున్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇప్పుడు పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ కూడా విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 22న(గురువారం) పంజాబ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. 

పంజాబ్ ప్రజల కలలను సాకారం చేసేందుకు ఆప్ ఎమ్మెల్యేలు కృత నిశ్చయంతో ఉన్నారని రుజువు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు. ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన ఈమేరకు వీడియో సందేశం పంపారు.

తమ ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదిస్తోందని పంజాబ్ ఆర్థిక మంత్రి హర్‌పాల్ సింగ్ ఛీమ ఇటీవలే ఆరోపించారు. ఒక్క ఎమ్మెల్యేలకు రూ.25 కోట్లు ఇస్తామని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. దాదాపు 11 మంది ఆప్ ఎమ్మెల్యేలకు బీజేపీ నుంచి ఫోన్ వచ్చినట్లు చెప్పారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందన్నారు.

కాగా.. ఈ నెలలోనే ఢిల్లీ అసెంబ్లీలో బలం నిరూపించుకున్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. అనంతరం ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీ ప్రలోభాలకు తలొగ్గలేదని చెప్పారు. ఈ విశ్వాస పరీక్షలో ఆప్‌కు 58 ఓట్లు వచ్చాయి. మరో నలుగురు ఎమ్మెల్యేలు వ్యక్తిగత కారణాలతో అసెంబ్లీకి హాజరు కాలేదు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 సీట్లు కాగా.. ఆప్‌కు 62, బీజేపీకి 8 మంది సభ్యులున్నారు.
చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో శశి థరూర్‌! సోనియాతో కీలక భేటీ

>
మరిన్ని వార్తలు