యూపీ ఎన్నికలు; కేజ్రీవాల్‌ కీలక నిర్ణయం

15 Dec, 2020 12:33 IST|Sakshi

2022 ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో సత్తా చాటుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో పాగా వేసేందుకు సిద్ధమవుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ క్రమంలో 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనుంది.  ఈ మేరకు ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రకటించారు.  తదుపరి ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనున్నట్లు  కేజ్రీవాల్‌ తెలిపారు.

ఢిల్లీ మాదిరిగానే తమ రాష్ట్రంలో పాలనను, సౌకర్యాలను అందించాలని యూపీ వాసులు కోరుతున్నారని ఆయన పేర్కొన్నారు. వైద్య అవసరాలు, విద్య, తదితర సౌకర్యాల కోసం ఉత్తర ప్రదేశ్‌లోని జిల్లాల ప్రజలు  ఢిల్లీకి ఎందుకు రావాలి? వారు తమ సొంత రాష్ట్రంలోనే ఈ సౌకర్యాలన్నీ పొందాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. వైద్య అవసరాలు, విద్య, తదితర సౌకర్యాల కోసం ఉత్తర ప్రదేశ్‌లోని జిల్లాల ప్రజలు  ఢిల్లీకి ఎందుకు రావాలి? వారు తమ సొంత రాష్ట్రంలోనే పొందాలి అనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.  ఉత్తర ప్రదేశ్ లోని అన్ని పార్టీలు ప్రజలకు ద్రోహం చేశాయని కేజ్రీవాల్  వ్యాఖ్యానించారు.  ఇప్పటి వరకూ అవినీతి విషయంలో అన్ని ప్రభుత్వాలు ఒకదాన్ని మరొకటి మించిపోయాయన్నారు. తమ ప్రభుత్వం ద్వారా మంచిరోజులు రానున్నాయని, తమ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని యూపీ ఓటర్లను కోరారు. నిజాయితీ ప్రభుత్వంకోసం ఎదురు చూస్తున్న ఢిల్లీ ప్రజలు తమపార్టీకి అధికారాన్ని అందించారనీ, ప్రస్తుతం యూపీ ప్రజలకు కూడా నిజాయితీగల రాజకీయ పార్టీ అవసరమని  ఢిల్లీ సీఎం అన్నారు.

మరిన్ని వార్తలు