ఆమ్‌ ఆద్మీ పార్టీకి షాక్.. కీలక ఎన్నికకు ముందు బీజేపీలో చేరిన కౌన్సిలర్..

24 Feb, 2023 12:11 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీకి షాక్‌ తగిలింది. ఢిల్లీ బవానా వార్డు కౌన్సిలర్ పవన్ సెహ్రావత్‌ శుక్రవారం బీజేపీలో చేరారు. కమలం పార్టీ కార్యాలయంలో ఆయన  ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. బీజేపీ ఢిల్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్వేదా, ప్రధాన కార్యదర్శి హర్ష్ మల్హోత్రా పవన్‌కు ఘన స్వాగతం పలికారు.

అయితే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ముందే ఆప్ కౌన్సిలర్ పార్టీని వీడటం గమనార్హం. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, ఇది తనకు చాలా ఇబ్బందికరంగా ఉందని పవన్ ఆరోపించారు. ఢిల్లీ మేయర్ ఎన్నిక సందర్భంగా సభలో రచ్చ చేయాలని తనకు పార్టీ సూచించిందని పేర్కొన్నారు. ఇవన్నీ నచ్చకే తాను ఆప్‌ను వీడుతున్నట్లు చెప్పారు.

స్టాండింగ్ కమిటీ ఎన్నిక..
ఆరుగురు సభ్యులుండే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను మేయర్ షెల్లీ ఒబెరాయ్ గురువారం నిర్వహించారు. అయితే ఓటింగ్‌కు మొబెైల్‌ ఫోన్లను అనుమతించడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. కమలం, ఆప్ పార్టీ కౌన్సిలర్లు బాహాబాహీకి దిగారు. దీంతో 47 మంది ఓటు వేసిన అనంతరం ఓటింగ్‌ను అర్థాంతరంగా నిలివేశారు మేయర్. శుక్రవారం మళ్లీ ఈ ఎన్నిక నిర్వహించనున్నారు.

పలుమార్ల వాయిదా అనంతరం బుధవారం జరిగిన మేయర్ ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్  ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నిక రోజు కూడా సభలో బీజేపీ, ఆప్ కౌన్సిలర్లు ర‍చ్చ రచ్చ చేశారు. ఒకరిపై ఒకరు వాటర్ బాటిళ్లు విసురుకున్నారు.
చదవండి: పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష.. రూ. కోటి జరిమానా!

మరిన్ని వార్తలు