పాత రికార్డులను చీపురుతో ‘ఊడ్చిపడేసిన’ కేజ్రీవాల్‌.. 60ఏళ్ల రికార్డ్‌ బ్రేక్‌..

11 Mar, 2022 08:41 IST|Sakshi

న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ అఖండ విజయాన్ని అందుకుంది. ఈ సందర్బంగా ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎన్నికల గెలుపుపై స్పందించారు. మా రాజకీయ ప్రత్యర్థులను మట్టికరి పిస్తూ ఇంతటి విజయం అందించిన పంజాబ్‌ ప్రజలకు ఎన్నో కృతజ్ఞతలు. ఇలాంటి విప్లవం మొదట ఢిల్లీలో సంభవించింది. పంజాబ్‌ తీర్పుతో మున్ముందు దేశవ్యాప్తంగా ఇదే విప్లవం సంభవించనుందని అన్నారు.

ఇదిలా ఉండగా.. ఆప్‌ పంజాబ్‌లో మరో సరికొత్త రికార్డును క్రియేట్‌ చేసింది. ఇప్పటి వరకు కాంగ్రెస్‌ పేరిట ఉన్న రికార్డును చేరిపేస్తూ 60 ఏళ్ల తర్వాత కొత్త రికార్డును కేజ్రీవాల్‌ తిరగరాశారు. 1962 తర్వాత పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే పార్టీ(వేరే పార్టీలతో పొత్తు లేకుండా) 92 సీట్లు గెలవడం 2022 ఎన్నికల్లో చోటుచేసుకుంది. కాగా, 1962లో క్రాంగెస్‌ 90 స్థానాల్లో విజయం సాధించింది. తాజాగా 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ 92 స్థానాల్లో గెలుపొంది రికార్డును తిరగరాసింది. కాగా, బీజేపీ, అకాలీదళ్‌ కూటమి.. 1997లో 93 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 18, శిరోమణి అకాలీదళ్‌ 3, బీజేపీ 2, బీఎస్పీ 1 స్థానాల్లో గెలుపొందాయి.

ఆప్‌ ఢిల్లీ మోడల్‌కు పంజాబీలు ఫిదా..
ఆమ్‌ ఆద్మీ పార్టీ ఢిల్లీ మోడల్‌కు పంజాబ్‌ ప్రజలు పట్టం కట్టారు. నాణ్యమైన విద్య, వైద్య, సుపరిపాలన అందిస్తామన్న ఆప్‌కు అధికారాన్ని అప్పగించారు. పంజాబీల ఓటు దెబ్బకు కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్‌.. ఆప్‌ దరిదాపుల్లో కూడా లేకుండాపోయాయి. ఢిల్లీలో అందిస్తున్నట్లే సుపరిపాలన అందిస్తామని ప్రచారం సందర్భంగా కేజ్రీవాల్‌ చెప్పారు. 

మరిన్ని వార్తలు