చండీగఢ్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీకి చుక్కెదురు

28 Dec, 2021 05:53 IST|Sakshi
స్వీట్లు పంచుకుంటున్న ఆప్‌ నేతలు

అతిపెద్ద పార్టీగా ఆప్‌ 35 వార్డుల్లో 14 కైవసం

12 స్థానాలతో బీజేపీకి రెండోస్థానం

ఓటమి పాలైన ప్రస్తుత మేయర్‌

చండీగఢ్‌: ప్రతిష్టాత్మకమైన చండీగఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అతిపెద్ద పార్టీగా అవతరించింది. 35 స్థానాలకు గాను 14 చోట్ల నెగ్గింది. పంజాబ్, హరియాణాల ఉమ్మడి రాజధాని, కేంద్ర పాలితప్రాంతమైన చండీగఢ్‌లో కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆప్‌ బరిలోకి దిగిన మొదటిసారే తమ సత్తా చాటుకుంది. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

12 వార్డుల్లో గెలిచి రెండోస్థానంలో నిలిచింది. కాంగ్రెస్‌ ఎనిమిది స్థానాలు నెగ్గగా... శిరోమణి అకాలీదళ్‌ ఒకచోట గెలుపొందింది. చిత్రమేమింటే... 8 సీట్లు నెగ్గి మూడోస్థానంలో నిలిచిన కాంగ్రెస్‌కు అన్ని పార్టీలకంటే ఎక్కువగా 29.79 శాతం ఓట్లు పోలయ్యాయి. గతంలో 26 వార్డులుండగా (బీజేపీ 20, కాంగ్రెస్‌ 4, శిరోమణి అకాలీదళ్‌ 1) ప్రస్తుతం వాటి సంఖ్య 35కు పెరిగింది. శుక్రవారం ఎన్నికలు జరగగా... సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు.

ప్రస్తుత చండీగఢ్‌ మేయర్‌ రవికాంత్‌ శర్మ 17వ వార్డులో ఆప్‌ అభ్యర్థి దమన్‌ప్రీత్‌ సింగ్‌ చేతిలో 828 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మేయర్‌ పదవిని చేపట్టాలంటే సాధారణ మెజారిటీ.. 18 స్థానాలు కావాలి. పంజాబ్‌లో వచ్చే ఫిబ్రవరి– మార్చి నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందువల్ల కాంగ్రెస్, అకాలీదళ్‌లు ఆప్‌కు మద్దతు ఇచ్చే అవకాశాలు స్వల్పం. 12 స్థానాలు నెగ్గిన బీజేపీ ఓటమిని అంగీకరించి... మేయర్‌ పదవికి పోటీకి దూరంగా ఉంటుందా? లేక ఇతర పార్టీల కార్పొరేటర్లకు వలవేసి మళ్లీ అధికారపీఠాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తుందా? అనేది చూడాలి.  

పంజాబ్‌లో మార్పుకు సంకేతం: కేజ్రీవాల్‌
చండీగఢ్‌ కార్పొరేషన్‌ ఫలితాలు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే పంజాబ్‌లో రాబోయే మార్పుకు సంకేతమని ఆప్‌ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. చండీగఢ్‌ వాసులు నీతివంతమైన పాలనకు పట్టం కట్టారని, ప్రత్యర్థి పార్టీల అవినీతిమయమైన రాజకీయాలను తిరస్కరించారని పేర్కొన్నారు. ఆప్‌ కార్యకర్తలకు, విజేతలకు అభినందనలు తెలిపారు. ఆప్‌ పంజాబ్‌ వ్యవహారాల ఉపబాధ్యుడు రాఘవ్‌ చద్దా (ఢిల్లీ ఎమ్మెల్యే) స్పందిస్తూ.. ‘పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇది ట్రైలర్‌ మాత్రమే. అసలు సినిమా ముందుంది’ అని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు