ఢిల్లీ అసెంబ్లీలో హైడ్రామా.. లెఫ్టినెంట్ గవర్నర్ రాజీనామాకు ఆప్ డిమాండ్‌

30 Aug, 2022 11:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో సోమవారం రాత్రి హైడ్రామా నెలకొంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు పోటాపోటీగా రాత్రంతా ఆందోళనలు నిర్వహించారు. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటా మంగళవారం ఉదయం వరకు అసెంబ్లీ ఆవరణలో గడిపారు. ఆప్‌ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురి కాలేదని నిరూపించేందుకు తాను బలపరీక్ష ఎదుర్కొంటానని కేజ్రీవాల్ ప్రకటించిన వెంటనే అసెంబ్లీలో రగడ మొదలైంది.

ఆప్‌ ఆరోపణలు..
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ వినయ్ కుమార్ సక్సెనా 2016లో రూ.1400కోట్ల అవినీతికి పాల్పడ్డరని ఆప్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఆయన ఖాదీ అండ్ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ కమిషన్‌(కేవీఐసీ) ఛైర్మన్‌గా ఉన్నప్పుడు ఈ కుంభకోణం జరిగిందని చెప్పారు. దీనిపై సీబీఐకి కూడా ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు వ్యతిరేకంగా ఆప్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు.

బీజేపీ ధర్నా..
మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లిక్కర్ పాలసీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలోని భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖ్‌దేవ్ విగ్రహాల ముందు ధర్నాకు దిగారు.

ఆప్‌ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20కోట్లు ఆశచుపారని ఇదివరకే చెప్పారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ చేపట్టిన ఆపరేషన్ లోటస్ విఫలమైందని నిరూపించేందుకు అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కొంటున్నట్లు ప్రకటించారు. విశ్వాస పరీక్షపై అసెంబ్లీలో మంగళవారమే ఓటింగ్ జరగనుంది. ఒక్క ఆప్‌ ఎమ్మెల్యే కుడా బీజేపీ ప్రలోభాలకు లొంగలేదని నిరూపితమవుతుందని కేజ్రీవాల్ అన్నారు.
చదవండి: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. వారి భేటీ అందుకేనా?

మరిన్ని వార్తలు