పెరుగుతున్న 'ఆప్‌' గ్రాఫ్‌.. తర్వాత టార్గెట్‌ ఆ రెండే..

11 Mar, 2022 02:51 IST|Sakshi

సుపరిపాలన కార్డుతోనే కేజ్రివాల్‌ ఎన్నికల పోరాటం 

గుజరాత్, హిమాచల్‌లపై ఇక దృష్టి

న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అనితరసాధ్యమైన విజయంతో జాతీయ రాజకీయాల్లో ఆ పార్టీ ఎలా చక్రం తిప్పుతుందన్న చర్చ మొదలైంది. కాంగ్రెస్‌ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా ఉండడంతో  జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ఆప్‌ ప్రత్యామ్నాయంగా మారుతుందన్న విశ్లేషణలున్నాయి. 2012లో అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన ఆప్‌ జాతీయ పార్టీ హోదాకి అడుగు దూరంలో ఆగిపోయింది. గుజరాత్‌ మోడల్‌ నినాదంతో ప్రధాని మోదీ జాతీయ రాజకీయాల్లోకి వచ్చినట్టుగానే ఢిల్లీ మోడల్‌ పాలనతో అరవింద్‌ కేజ్రివాల్‌ జాతీయ స్థాయిలో చక్రం తిప్పడానికి వ్యూహరచన చేస్తున్నారు.

పంజాబ్‌ విజయం ఇచ్చిన కిక్కుతో ఈ ఏడాది చివర్లో జరగబోయే గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల బరిలో దిగుతున్నారు. అందులోనూ ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో అడుగుపెట్టబోతున్న ఆప్‌ ఎలాంటి మాయ చేస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. అవినీతి రహిత పాలన కార్డుతోనే కేజ్రివాల్‌ ఏ రాష్ట్రంలోనైనా ప్రజల విశ్వాసాన్ని చూరగొంటున్నారు. దీంతో  కాంగ్రెస్‌కే ఎక్కువగా నష్టం  జరుగుతోంది. అందుకే కాంగ్రెస్‌కి ప్రత్యామ్నాయంగా ఆప్‌ ఎదుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

జాతీయ పార్టీగా అడుగు దూరం  
జాతీయ పార్టీగా గుర్తింపు రావాలంటే  మూడు వేర్వేరు రాష్ట్రాల నుంచి  లోక్‌సభలో 2% అంటే 11 సీట్లు  రావాలి లేదా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 6% ఓట్లు–ఏదైనా రాష్ట్రం నుంచి నాలుగు లోక్‌సభ సీట్లు వచ్చి ఉండాలి. లేదంటే నాలుగు, అంతకు మించి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు ఉండాలి. వీటిలో ఆప్‌ ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో 6% ఓట్లు, నాలుగు లోక్‌సభ స్థానాలను సాధించడం ద్వారా జాతీయ పార్టీగా ఎదగాలని ప్రయత్నిస్తోంది. గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కి 54% ఓట్లు వస్తే, పంజాబ్‌లో ఇప్పుడు 42% ఓట్లు సాధించింది.

గోవాలో ఆ పార్టీ ఓటు షేర్‌ 6.77% కాగా, ఉత్తరాఖండ్‌లో 4శాతానికి దగ్గరలో ఓట్లు సాధించింది. ఇక యూపీలో 0.3 శాతానికే పరిమితమైంది. లోక్‌సభలో  కనీసం 4స్థానాలైనా సాధించాల్సి ఉండగా ఒక్క స్థానం మాత్రమే ఉంది.  ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్, హిమాచల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో  గణనీయమైన ఓట్లు సాధిస్తామన్న ఆత్మ విశ్వాసంతో ఆ పార్టీ ఉంది. 2024 ఎన్నికల నాటికి మూడు వేర్వేరు రాష్ట్రాల నుంచి 2% ఓట్లు సాధించినా ఆ పార్టీకి జాతీయ హోదా దక్కుతుంది.

ఆప్‌ ప్రస్థానం సాగిందిలా..  
ఏప్రిల్‌–డిసెంబర్, 2011 
సామాజిక కార్యకర్త అన్నాహజారే ఢిల్లీ వేదికగా నిర్వహించిన అవినీతి వ్యతిరేక దీక్షలో  కేజ్రివాల్‌ అందరికీ పరిచయమయ్యారు.
 
అక్టోబర్, 2012  
అన్నాహజారే నుంచి విడిపోయి ఇతర ఉద్యమకారులతో కలిసి కేజ్రివాల్‌  ఆప్‌ని స్థాపించారు.  

డిసెంబర్, 2013 
ఢిల్లీ అసెంబ్లీ బరిలో తొలిసారిగా దిగిన ఆప్‌ 70 స్థానాలకు గాను తొలి ప్రయత్నంలో 28 సీట్లలో నెగ్గింది.   

ఫిబ్రవరి, 2014 
ఢిల్లీ అసెంబ్లీలో సభ్యుల మద్దతు లేక జన్‌ లోక్‌పాల్‌ బిల్లుని పాస్‌ చేయించుకోవడంలో విఫలమైన ఆప్‌ ప్రభుత్వం రాజీనామా చేసింది.  

ఏప్రిల్‌–మే, 2014 
లోక్‌సభ ఎన్నికల్లో 400కిపైగా స్థానాల్లో పోటీ చేసిన ఆప్‌ పంజాబ్‌ నుంచి 4 స్థానాల్లో నెగ్గింది 

ఫిబ్రవరి, 2015 
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 54% ఓటు షేరుతో 70 స్థానాలకు గాను 67 స్థానాల్లో విజయ దుందుభి మోగించింది.
 
ఫిబ్రవరి, 2017 
పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 117 స్థానాల్లో 20 సీట్లలో విజయం సాధించింది. 

ఏప్రిల్‌–మే, 2019 
లోక్‌సభ ఎన్నికలు వచ్చేసరికి ఆప్‌ గ్రాఫ్‌ పడిపోయింది. ఢిల్లీ, పంజాబ్, గోవాలో మాత్రమే దృష్టి సారించినప్పటిక పంజాబ్‌లో సంగ్రూర్‌ స్థానంలో విజయం సాధించగలిగింది. 

ఫిబ్రవరి 2020 
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో  70 స్థానాలకు గాను 62 స్థానాల్లో నెగ్గింది.
 
మార్చి, 2022 
117 స్థానాలకు గాను 92 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది.   

మరిన్ని వార్తలు