కాంగ్రెస్‌ పార్టీపై సంచలన వ్యాఖ‍్యలు.. బీజేపీకి కౌంటర్‌

16 Apr, 2022 19:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పొలిటికల్‌ సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ పెట్టగా.. జాతీయ పార్టీ కాంగ్రెస్‌ ఓటముల నుంచి ఎలా గట్టెక్కాలో వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహకర్త ప్ర‌శాంత్ కిశోర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో భేటీ అవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. 

వీరి భేటీ నేపథ్యంలో ఆప్‌ రాజ్యసభ ఎంపీ రాఘవ్‌ చద్దా.. కాంగ్రెస్‌ పార్టీపై సంచలన కామెంట్స్‌ చేశారు. చద్దా శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఓ చ‌నిపోయిన గుర్ర‌మ‌ని, దానిని ఎన్ని కొర‌డాల‌తో కొట్టినా.. అది ప‌రిగెత్త‌ద‌ని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీకి కేవలం ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మాత్రమే సవాల్‌ విసరగలరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీకి కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయంకాదని కుండబద్దలు కొట్టారు.

అంతటితో ఆగకుండా.. బీజేపీ పార్టీపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. బీజేపీ ఎప్పటికీ హింసాత్మ‌క ఎజెండాతోనే ముందుకు సాగుతుందని బాంబు పేల్చారు. బీజేపీ ప్ర‌భుత్వాలు ఎన్న‌టికీ మంచి పాఠ‌శాల‌ల‌ను నిర్మించ‌లేవ‌ని, ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించలేవని అన్నారు. కేవ‌లం నిర‌క్ష‌రాస్య గూండాల‌ను మాత్ర‌మే త‌యారు చేస్తారని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. 

మరిన్ని వార్తలు