ఆప్ ఆదరణ చూసి ఓర్వలేకే ఎమ్మెల్యేల అరెస్టులు.. బీజేపీపై కేజ్రీవాల్ ఫైర్‌..

17 Sep, 2022 15:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అమానతుల్లా ఖాన్‌కు మద్దతుగా నిలిచారు. దర్యాప్తు సంస్థలన్నీ బీజేపీకి వత్తాసు పలుకుతున్నాయని విమర్శించారు.

గుజరాత్‌లో ఆప్‌కు లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే కమలం పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. అమానతుల్లా ఖాన్‌ లాగే ఇంకా చాలా మంది ఆప్‌ ఎమ్మెల్యేలను రానున్న రోజుల్లో అరెస్టు చేస్తారని కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్‌తో ఆప్‌ బలపడటం చూసి బీజేపీ హర్ట్ అవ్వడమే ఇందుకు కారణమన్నారు.

'మొదట ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్‌ను అరెస్టు చేశారు. కానీ కోర్టులో ఎలాంటి ఆధారం సమర్పించలేకపోయారు. ఆ తర్వాత ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఇంటిపై దాడులు చేశారు. కానీ ఏమీ కనిపెట్టలేకపోయారు. ఇప్పుడు ఆప్‌ ఎ‍మ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను అరెస్టు చేశారు. మున్ముందు ఇంకా చాలా మంది ఆప్‌ నేతలను అరెస్టు చేస్తారు. ఇదంతా చూస్తుంటే గుజరాత్‌లో వాళ్లకు దెబ్బతగిలినట్లు అర్థమవుతోంది' అని కేజ్రీవాల్ అన్నారు.

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కూడా దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆపరేషన్ లోటస్‌లో భాగంగానే ఆప్‌ ఎమ్మెల్యేలను విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.  ఢిల్లీ వక్ఫ్‌బోర్డులో అవినీతి జరిగిందనే ఆరోపణలతో దానికి ఛైర్మన్‌గా ఉన్న అమానతుల్లా ఖాన్‌ను ఏసీబీ శుక్రవారం అరెస్టు చేసింది. ఆయన సన్నిహితుల ఇళ్లపైనా దాడులు చేసింది.
చదవండి: చీతా ప్రాజెక్టు తమ హయాంలోనే ప్రారంభమైంది: కాంగ్రెస్‌

మరిన్ని వార్తలు