ఆప్‌, బీజేపీ కరెన్సీ నోట్ల పంచాయితీ.. మధ్యలోకి ఎంట్రీ ఇచ్చిన కాంగ్రెస్‌

28 Oct, 2022 06:17 IST|Sakshi

న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికలు ముందున్న వేళ కరెన్సీ నోట్లపై ముద్రించే చిత్రాల వివాదం ముదురుతోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ హిందూ వ్యతిరేకి అని బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి, దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోందన్న విషయాన్ని చాటి చెప్పడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కొత్త వాదన తెరపైకి తెచ్చారు. లక్ష్మీదేవి, గణేశుడి చిత్రాలను ముద్రిస్తే మన దేశం సుసంపన్నమవుతుందని ఆయన వాదిస్తున్నారు.

ముస్లిం దేశమైన ఇండోనేసియాలో గణేశుడి చిత్రాన్ని ముద్రిస్తూ ఉంటే మనం చేస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇండోనేసియాలో 20 వేల రూపాయల నోటుపై మాత్రమే గణేశుడి బొమ్మ ఉంటుంది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ చిత్రం ముద్రించాలని డిమాండ్‌ చేస్తోంది. అంబేద్కర్‌ నిర్దేశించిన  మార్గదర్శకాల ప్రకారమే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉనికిలోకి వచ్చిందని కాబట్టి ఆయన చిత్రమే ముద్రించాలని అంటోంది.

నోట్లపై ఎవరి బొమ్మలు ముద్రించాలి, డిజైన్‌ ఎలా ఉండాలి అన్న అధికారం కేంద్రప్రభుత్వంతో పాటు రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా చట్టంలోని సెక్షన్‌ 22 ప్రకారం ఆర్‌బీఐకే ఉంది. గుజరాత్‌ ఎన్నికల దృష్ట్యా కేజ్రివాల్‌ లక్ష్మీదేవి చిత్రం ముద్రించాలన్న డిమాండ్‌  తెచ్చారని కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్‌ తివారీ ధ్వజమెత్తారు. అసలు నోటుపై ఎవరిదైనా చిత్రాన్ని ముద్రించాలంటే అన్నివిధాలా అర్హుడైన వ్యక్తి అంబేద్కరేనని ఆయన అంటున్నారు. గాంధీజీ, అంబేడ్కర్‌ చిత్రాలతో నోట్లను ముద్రించాలన్న డిమాండ్‌ తెచ్చి కాంగ్రెస్‌ పార్టీ పొలిటికల్‌ హీట్‌ పెంచింది.

ఒక్కసారి చరిత్రలోకి వెళితే  
1969లో తొలిసారి గాంధీ శతజయంతిని పురస్కరించుకొని ఆయన  చిత్రాలున్న  నోట్లు అందుబాటులోకి వచ్చాయి. అంతకుముందు ప్రముఖ గుళ్లు, గోపురాలు, ఉపగ్రహాలు, ఆనకట్టలు, ఉద్యానవనాలు వంటివి ముద్రించారు. 1935లో ఆర్‌బీఐ ఏర్పాటయ్యాక 1938లో తొలిసారిగా రూపాయి నోటు ముద్రించింది. 1949లో  జాతీయ చిహ్నమైన నాలుగు సింహాలు, అశోక స్తూపాన్ని నోట్లపై ముద్రించారు. తర్వాత జింకలు, ఏనుగులు, పులుల చిత్రాలు నోట్లపై వచ్చాయి. 1954లో ఆర్‌బీఐ విలువ అధికంగా ఉండే రూ.1,000, రూ.5,000, రూ.10,000 నోట్లను ముద్రించినప్పుడు తంజావూర్‌ ఆలయం, గేట్‌ వే ఆఫ్‌ ఇండియా, సారానాథ్‌లో అశోక స్తూపం నోట్లపై వచ్చి చేరాయి. తర్వాత పార్లమెంటు, బ్రహ్మేశ్వర్‌ ఆలయం కనిపించాయి.

మరిన్ని వార్తలు