మోదీ అడ్డాలో పాగాకు కేజ్రీవాల్‌ పక్కా ప్లాన్‌! 300 యూనిట్ల ఉచిత కరెంటు, బకాయిల రద్దు హామీ

21 Jul, 2022 18:36 IST|Sakshi
అరవింద్ కేజ్రీవాల్ హామీలు

సూరత్‌: ఈసారి గుజరాత్‍లో ఎలాగైనా పాగావేయాలని భావిస్తోంది ఆమ్‌ ఆద్మీ పార్టీ. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రజలపై హామీల వర్షం కురిపిస్తోంది.  గురువారం సూరత్‌లో జరిగిన ఓ సమావేశానికి హాజరైన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. తమను గెలిపిస్తే నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తామని ప్రకటించారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉంటుందని చెప్పారు.

తాము  అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలపై గుజరాత్‌లోని ప్రతి ఇల్లు తిరిగి ప్రచారం నిర్వహిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. తాము ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకపోయినా మళ్లీ ఆప్‌కు ఓటు వేయొద్దని స్పష్టం చేశారు. గుజరాత్‌లో అవినీతిని అంతం చేస్తే తాను సీఎంగా ఉన్న ఢిల్లీ మోడల్ తరహాలోనే ఉచిత విద్యుత్ సాధ్యమవుతుందని వివరించారు. అంతేకాదు ఆప్‌ను గెలిపిస్తే 2021 డిసెంబర్ ముందు వరకు ఉన్న విద్యుత్ బకాయిలను రద్దు చేస్తామన్నారు.

మార్పు కోరుకుంటున్నారు
గుజరాత్ ప్రజలు 27ఏళ్ల బీజేపీ పాలనతో విసిగిపోయారని కేజ్రీవాల్ అన్నారు. ఇక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. డిసెంబర్‌లో జరగనున్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని ఆప్ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే కేజ్రీవాల్ ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. జులైలో ఆయన రాష్ట్రానికి రావడం ఇది రెండోసారి.
చదవండి: బీజేపీ నేతలకు మమత వార్నింగ్‌.. ‘ఇక్కడకు రావొద్దు రాయల్‌ బెంగాల్ టైగర్ ఉంది’

మరిన్ని వార్తలు