మమతా బెనర్జీ మేనల్లుడి కాన్వాయ్‌పై దాడి

2 Aug, 2021 15:57 IST|Sakshi

అగర్తల పర్యటనలో అభిషేక్‌ బెనర్జీ కాన్వాయ్‌పై దాడి

బీజేపీ కార్యకర్తలే ఈ దాడి చేశారు: అభిషేక్‌ బెనర్జీ

అగర్తల: టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ కాన్వాయ్‌పై దాడి జరిగింది. అది కూడా వేరే రాష్ట్రంలో. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు.. డైమండ్‌ హర్బర్‌ టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ సోమవారం త్రిపుర అగర్తలలో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన కాన్వాయ్‌పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. బీజేపీ నేతలే కావాలని తనపై దాడి చేయించారని అభిషేక్‌ బెనర్జీ ఆరోపించారు. 

ఈ మేరకు అభిషేక్‌ బెనర్జీ ట్విటర్‌లో ‘‘బీజేపీ నాయకత్వంలోని త్రిపురలో ప్రజాస్వామ్యం ఇలా ఉంది. విప్లవ్‌ దేవ్‌ మీరు రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు.. మిమ్మల్ని అభినందిస్తున్నాను’’ అంటూ తన కాన్వాయ్‌పై జరిగిన దాడికి సంబంధించిన వీడియోని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దీనిలో అభిషేక్‌ బెనర్జీ ప్రయాణిస్తున్న రోడ్డు పక్కన.. కొందరు వ్యక్తులు నిలుచుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం వీడియోలో చూడవచ్చు. వీరిలో కొందరి చేతిలో బీజేపీ జెండా ఉంది. కాన్వాయ్‌ అలా ముందుకు వెళ్తుండగా.. ఓ వ్యక్తి కర్రతో అభిషేక్‌ బెనర్జీ ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేశాడు. 

వేరే రాష్ట్రంలో పర్యటిస్తున్న తమ ఎంపీ కాన్వాయ్‌పై దాడి చేయడాన్ని టీఎంసీ నాయకులు ఖండించారు. ఈ క్రమంలో టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ అభిషేక్ బెనర్జీ కాన్వాయ్‌పై జరిగిన దాడిని ఖండించడమేకాక ఈ విషయాన్ని పార్లమెంట్‌ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అభిషేక్‌ బెనర్జీ త్రిపురలో పర్యటిస్తుండటంతో.. అగర్తలలో బీజేపీ కార్యకర్తలు తమ పార్టీ పోస్టర్‌లను చించేశారని టీఎంసీ నాయకులు ఆరోపించారు. 

మరిన్ని వార్తలు