AP: మున్సిపోల్స్‌కు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

3 Nov, 2021 11:45 IST|Sakshi

నామినేషన్లకు 5 చివరి తేదీ

నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు 12 మునిసిపాలిటీలు,

నగర పంచాయతీల్లో ఎన్నికలు

అలాగే 7 కార్పొరేషన్లు, 13 మునిసిపాలిటీల్లో ఖాళీ స్థానాలకు కూడా

15న పోలింగ్‌

మొత్తం 9.58 లక్షల ఓటర్లు

14 జెడ్పీటీసీ, 176 ఎంపీటీసీ స్థానాల్లోనూ నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ

Updates:
ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన కార్పొరేషన్‌, స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. నెల్లూరు కార్పొరేషన్‌లో  9వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రాజశేఖర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ కార్యక్రమంలో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

సాక్షి, అమరావతి: నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు 12 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 54 డివిజన్లు, 353 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. అలాగే 7 కార్పొరేషన్‌లు, 13 మునిసిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల మరణంతో ఖాళీ అయిన స్థానాలకు, ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు జరగని డివిజన్లు, వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు.

(చదవండి: Rain Alert: ఏపీలో భారీ వర్షాలు)

ఈ నెల 15న వీటికి ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. బుధవారం (నేడు) నుంచి శుక్రవారం వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. శనివారం నామినేషన్ల పరిశీలన చేపడతారు. పోటీ చేయని అభ్యర్థులు సోమవారం మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు.

మహిళా ఓటర్లే అత్యధికం
ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో 9,58,141 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 4,67,045 మంది పురుషులు కాగా 4,90,897 మంది మహిళలు. 199 మంది ఇతర ఓటర్లు. మొత్తం ఓటర్లలో 4,77,244 మంది నెల్లూరులో ఉండగా మిగిలినవారు ఇతర మునిసిపాలిటీల్లో ఉన్నారు.

10 చోట్ల తొలిసారి..
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, కొండపల్లి, గుంటూరు జిల్లా దాచేపల్లి, గురజాల, ప్రకాశం జిల్లా దర్శి, చిత్తూరు జిల్లా కుప్పం, కర్నూలు జిల్లా బేతంచర్ల, వైఎస్సార్‌ జిల్లా కమలాపురం, రాజంపేట, అనంతపురం జిల్లా పెనుకొండ మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు..
ఎన్నికలు నిలిచిన 14 జెడ్పీటీసీ స్థానాలతోపాటు 176 ఎంపీటీసీ, 69 సర్పంచ్, 533 వార్డు సభ్యుల స్థానాలకు బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు మరణించడంతో ఆగిన ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్న విషయం విదితమే. మరణించిన అభ్యర్థి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి మాత్రమే ఆయా స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. అందులో ఆరు జెడ్పీటీసీ స్థానాల్లో కేవలం టీడీపీ అభ్యర్థులకు మాత్రమే కొత్తగా నామినేషన్ల వేసుకునే వీలుంటుంది.

అలాగే రెండేసి చొప్పున జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు కొత్తగా నామినేషన్లు వేసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. ఒక జెడ్పీటీసీ స్థానంలో బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులకు అవకాశమిచ్చింది. ఈ జెడ్పీటీసీ స్థానాలతో పాటు 81 ఎంపీటీసీ స్థానాల్లో అన్ని పార్టీల నుంచి కాకుండా కేవలం ఒక్కొక్క పార్టీ నుంచి మాత్రమే నామినేషన్ల స్వీకరణకు అనుమతిచ్చింది. కాగా, మరో మూడు జెడ్పీటీసీ స్థానాలు, 95 ఎంపీటీసీ స్థానాలు, 69 గ్రామ సర్పంచ్, 533 వార్డు సభ్యులకు అన్ని రాజకీయ పార్టీల నుంచి, స్వతంత్రుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.

మరిన్ని వార్తలు