మహారాష్ట్ర గవర్నర్‌ రఫెల్‌ కంటే వేగంగా వ్యవహరించారు: సంజయ్‌ రౌత్‌ సెటైర్లు

29 Jun, 2022 15:17 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్‌లమీద ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో రేపు(గురువారం) బల నిరూపణ పరీక్ష జరగనుంది. ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి సాయంత్రం 5 గంటలలోపు బల పరీక్ష ప్రక్రియ ముగించాలని మహారాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీకి గవర్నర్‌ లేఖ రాశారు. దీంతో బలపరీక్షపై గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ ఆదేశాలను సవాల్‌ చేస్తూ శివసేన సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై నేడు సాయంత్రం 5 గంటలకు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. 

జెట్‌ స్పీడ్‌ కంటే వేగంగా..
తాజాగా గవర్నర్‌ ఆదేశాలపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్పందించారు. మహారాష్ట్ర గవర్నర్ గురువారం బలపరీక్షకు ఆదేశించడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా రౌత్‌ అభివర్ణించారు. గవర్నర్‌ జెట్‌ స్పీడ్‌ కంటే వేగంగా వ్యవహరించారని సెటైర్లు వేశారు. రాఫెల్‌ జెట్‌ కూడా ఇంత వేగంగా ఉండదని అన్నారు. అంతేగాక గవర్నర్‌ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బల పరీక్ష కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించాలన్న గవర్నర్ ఆదేశాలపై ఉద్ధవ్ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయిచారని రౌత్ చెప్పారు. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు ఇంకా నిర్ణయం తీసుకోనప్పుడు బల పరీక్ష వంటి చర్య ఏదైనా చట్టవిరుద్దమని ఆయన అన్నారు.

‘రెబెల్‌ మ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఫ్లోర్ టెస్ట్ జరగదని మేం చెబుతూనే ఉన్నాం. ఇది చట్టవిరుద్ధమైన చర్య. 16 మంది ఎమ్మెల్యేల అనర్హత అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ, గవర్నర్ హౌజ్‌ కలిసి ప్రయత్నిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా మేం సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం కోసం పోరాడుతాం. మాతో పోరాడాలనుకుంటే ముందుకు వచ్చి పోరాడండి’ అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. 
చదవండి: బలపరీక్ష ఆదేశాలు.. సుప్రీంకోర్టులో శివసేన పిటిషన్‌

భారీ భద్రత
గురువారం బల పరీక్ష నేపథ్యంతో అసెంబ్లీ లోపల, బయట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించారు. గురువారం సాయంత్రం 5 గంటలలోపు ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. ఏ కారణంతోనైనా అసెంబ్లీ సమావేశం వాయిదాకు వీల్లేదని అన్నారు. బల పరీక్ష ప్రక్రియను వీడియోగ్రఫీ చేయాలని తెలిపారు.

మరిన్ని వార్తలు