సైకిల్‌కు రూ.300: పరువు పోగొట్టుకున్న టీడీపీ నేతలు..

3 Aug, 2021 12:59 IST|Sakshi
టీడీపీ జిల్లా కార్యాలయం నుంచి విద్యార్థులను బయటకు పంపిస్తున్న పోలీసులు  

పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపునకు నిరసనగా టీడీపీ చేపట్టిన సైకిల్‌ ర్యాలీ అభాసుపాలు 

కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నేతలు దూరం

చిన్నపిల్లలతో ప్రదర్శనకు యత్నం

ఒక్కొక్కరికి రూ.300 ఇచ్చి జెండాలు పట్టించిన వైనం

పిల్లలను పోలీసులు అడ్డుకోవడంతో నిరసన కార్యక్రమం విరమణ

పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ టీడీపీ చేపట్టిన సైకిల్‌ ర్యాలీకి ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు ఝులక్‌ ఇచ్చారు. ఒంగోలు నగరంలోని టీడీపీ కార్యాలయానికి సోమవారం ఉదయం ప్రధాన నాయకులు వచ్చారు. ఎంత సేపటికీ మిగతా నేతలు, కార్యకర్తలు రాకపోయేసరికి కంగుతిన్నారు. ఎక్కడ పరువు పోతుందోనని డబ్బులిచ్చి  చిన్నపిల్లలను ర్యాలీకి తీసుకొచ్చి అభాసుపాలయ్యారు. ర్యాలీలో చిన్నపిల్లలు పాల్గొనకుండా పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నేతలు కనీసం ఉనికి సైతం చాటుకోలేక పరువుపోగొట్టుకుని బిక్కమొహాలతో వెనుదిరిగారు. జిల్లాలో టీడీపీ నిరసన ర్యాలీ ‘నీరసంగా’ సాగింది. ఆ పార్టీ దయనీయ పరిస్థితికి ఈ ఘటన అద్దం పడుతోంది. 

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: డీజిల్, పెట్రోలు ధరల పెంపునకు నిరసనగా సైకిల్‌ ర్యాలీ నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలిచ్చారు. దీంతో ఆ పార్టీ జిల్లా నాయకులు సోమవారం జరిగే సైకిల్‌ ర్యాలీలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తీరా సోమవారం నిర్వహించాల్సిన సైకిల్‌ ర్యాలీకి నాయకులు, కార్యకర్తలు కరువయ్యారు. పాల్గొనేందుకు ప్రజలు కూడా విముఖత చూపారు. అసలు సైకిల్‌ ర్యాలీకి సైకిళ్లే కరువయ్యాయి. ఈ కార్యక్రమానికి వచ్చిన పది నుంచి పదిహేను మంది కూడా కార్లు, బైకుల్లో అక్కడకు చేరుకున్నారు. మరి సైకిళ్లు ఎవరు తేవాలి..? చదువుకునే పిల్లల్ని వాళ్లకున్న సైకిళ్లతో సహా టీడీపీ జిల్లా కార్యాలయానికి రప్పించారు. సైకిళ్లకు పార్టీ జెండాలు కట్టారు. పిల్లల మెడలో వేసుకోవడానికి కూడా పార్టీ జెండాలు ఇచ్చారు.

మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ రాగానే పాత గుంటూరు రోడ్డులోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి కొద్ది మంది నాయకులు, చిన్నారులతో ర్యాలీగా బయలుదేరారు. అంతే, ఒంగోలు డీఎస్పీ ప్రసాదు తన సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదు, దానికితోడు చదువుకునే పిల్లలతో సైకిల్‌ ర్యాలీ ఏమిటని టీడీపీ నేతలను నిలదీశారు. అనంతరం పిల్లలందరినీ అక్కడి నుంచి పంపించి వేశారు. పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరిన ర్యాలీలో జనార్దన్‌కు మాత్రమే ఒక్క సైకిల్‌ మిగిలింది. అక్కడ నుంచి ర్యాలీగా నడుచుకుంటూ బయలుదేరేందుకు టీడీపీ నాయకులు పూనుకున్నారు. కానీ, పోలీసులు అడ్డుకుని తిరిగి పార్టీ కార్యాలయంలోకే పంపించి వేశారు. ఆ సమయంలో పోలీసులకు, పార్టీ నాయకులకు మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. అసలు విషయం ఏమిటంటే ర్యాలీకి వచ్చిన పిల్లాడితో పాటు సైకిల్‌కు రూ.300 ఇస్తామని చెప్పిమరీ తీసుకొచ్చినట్లు గుసగుసలు వినిపించాయి.

నేతలకు, కేడర్‌కు మధ్య అగాధం... 
జిల్లాలో తెలుగుదేశం పార్టీ రానురానూ ఉనికి కోల్పోతోంది. నాయకులే కాదు కార్యకర్తలు సైతం పార్టీకి దూరమవుతూ వస్తున్నారు. నిరసన కార్యక్రమాలు చేపట్టాలని అధినేత చంద్రబాబు చెప్పడం.. ఆ కార్యక్రమాలకు పార్టీ జిల్లా నాయకులు కేడర్‌కు పిలుపునివ్వడం సర్వసాధారణమైంది. అయితే, ఇక్కడే పార్టీ పెద్దలకు, కేడర్‌కు మధ్య పెద్ద అగాధమే ఏర్పడింది. ఏ నిరసన కార్యక్రమానికి పిలుపినిచ్చినా ఆ పది, పదిహేను మంది మాత్రమే హాజరవుతున్నారే తప్ప పార్టీ కేడర్‌లో కదలిక లేకుండా పోయింది. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం పదవులు అనుభవించిన నాయకులంతా కరోనా కష్టకాలంలో సైతం కనిపించకుండాపోయి ఇప్పుడు నిరసన కార్యక్రమాలంటూ రావడాన్ని పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.

ప్రజల మాట అటుంచితే కరోనా సమయంలో పార్టీ కార్యకర్తల బాగోగులు సైతం పట్టించుకోకుండా తప్పించుకు తిరిగారంటూ ఆ పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు పిలిచినప్పుడు వారి సంగతి తేలుద్దామని వేచిచూస్తున్న టీడీపీ కార్యకర్తలకు ఆ సమయం రానే వచ్చింది. నిరసన కార్యక్రమానికి తరలిరావాలంటూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ పిలుపునిచ్చినా కనీస స్పందన కూడా లేని దుస్థితి నెలకొంది. కార్యకర్తలు ఝలక్‌ ఇచ్చారని తెలుసుకున్న టీడీపీ నేతలు కంగుతిని పరువు నిలుపుకునేందుకు స్కూలు పిల్లలను పిలిపించుకుని ఛీ అనిపించుకున్నారు. ఈ ఘటనతో జిల్లాలో ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిన విషయం స్పష్టమవుతోంది. 

మరిన్ని వార్తలు