కుష్బూను సందిగ్ధంలో పడేసిన గ్రూపు రాజకీయాలు

28 Sep, 2020 06:20 IST|Sakshi

రాష్ట్ర నేతలకు బీజేపీ అధిష్టానం షాక్‌ 

రాజానూ పక్కన పెట్టారు  

మురుగన్‌తో సుందర్‌ సి భేటీ చర్చ 

సాక్షి, చెన్నై: బీజేపీ జాతీయ కార్యవర్గంలో తమిళనాడు నేతలకు చోటు దక్కలేదు. ఇది ఆ పార్టీ వర్గాల్ని షాక్‌కు గురి చేసింది. రాజాను సైతం పక్కన పెట్టడంతో చర్చ మొదలైంది. ఇక, బీజేపీలోకి నటి, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి కుష్బూ చేరబోతున్నట్టు ప్రచారం జోరందుకుంది. పార్టీ కోసం ఏళ్ల తరబడి శ్రమిస్తున్న నేతలెందరో రాష్ట్ర బీజేపీలో ఉన్నారు. అధికారంలోకి వచ్చినప్పుడల్లా పొన్‌ రాధాకృష్ణన్‌కు మంత్రి వర్గంలో చోటు గ్యారంటీ. అయితే, ఈ సారి ఆయన కన్యాకుమారి నుంచి ఓటమి చవిచూడడంతో అది చేజారింది.

పార్టీపరంగా బీజేపీ జాతీయ కమిటీలో రాష్ట్రానికి చెందిన సీనియర్లకు అవకాశాలు  ఏళ్ల తరబడి ఇవ్వడం జరుగుతోంది. అయితే, ఈ సారి అది కూడా చేజారింది.  ఇప్పటికే రాష్ట్ర కమిటీలో సీనియర్లను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పక్కన పెట్టారని చెప్పవచ్చు. ఇందుకు కారణం, కొత్త రక్తాన్ని నింపే దిశగా రాష్ట్ర కమిటీని ఎంపిక చేసి కొలువుదీర్చి ఉండడమే. రాష్ట్ర కమిటీలో చోటుదక్కని నేతలు జాతీయ కమిటీ పదవుల ఆశల పల్లకిలో ఉన్నా, ప్రస్తుతం అక్కడ కూడా అవకాశం దక్కలేదు. రాష్ట్ర బీజేపీలో పొన్‌ రాధాకృష్ణన్, సీపీ రాధాకృష్ణన్, ఇలగణేషన్, హెచ్‌ రాజా వంటి నేతలు ఉన్నా, ఏ ఒక్కరికి ఈ సారి అవకాశం దక్కలేదు. 

రాజానూ పక్కన పెట్టారు.. 
వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరుగా బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్‌ రాజా రాష్ట్రంలో ఉన్నారు. ఆరేళ్లుగా జాతీయ కార్యదర్శి పదవిలో ఉన్న ఆయన్ను కూడా పక్కన పెట్టారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఎనిమిదేళ్లు ఉన్న మురళీ ధర్‌రావుకు సైతం చోటు దక్కలేదు. దీంతో రాష్ట్ర బీజేపీ సీనియర్లను షాక్‌కు గురి చేసింది. అయితే రాష్ట్రంలో ఒక్క లోక్‌సభ, అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలిపించుకోలేని పరిస్థితుల్లో ఇక్కడి నేతలు ఉండబట్టే, ఈసారి వారికి షాక్‌ ఇచ్చే నిర్ణయాన్ని నడ్డా తీసుకున్నట్టు సమాచారం. దీంతో 2021 ఎన్నికల్లో అసెంబ్లీల్లో అడుగుపెట్టడం లక్ష్యంగా నేతలు వ్యూహాలు, పరుగులకు సిద్ధమవుతుండడం గమనార్హం. అక్టోబరు నుంచి ‘వెట్రివెల్‌’(విజయం సాధిద్దాం) నినాదంతో రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు.   (శశికళను ఎదుర్కొనేందుకు సిద్ధం)

కుష్బూకు గాలమా.. 
కుష్బూ బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జోరందుకుంది. ఆ పార్టీలోని గ్రూపు రాజకీయాలు కుష్బూను సందిగ్ధంలో పడేసినట్టు ఇప్పటికే ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీలోకి కుష్బూ  వస్తే బలం మరింత పెరుగుతుందన్న చర్చ సాగుతోంది. ఇందుకు తగ్గట్టుగానే కుష్బూ అడుగులు వేస్తున్నారా అనే సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు కారణం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ మురుగన్, కుష్బూ భర్త, నటుడు, దర్శకుడు సుందర్‌ సి భేటీ కావడమే. ఈ భేటీతో కుష్బూ బీజేపీలోకి చేరబోతున్న ప్రచారం జోరందుకుంది. అయితే, ఎల్‌ మురుగన్, సుందర్‌ సి భేటీ యాదృచ్ఛికంగా జరిగినట్టు ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఓ మిత్రుడి ఇంట్లో సుందర్‌ సి ఉండగా, అక్కడికి మురుగన్‌ వచ్చారేగానీ, ఈ పలకరింపు మర్యాదపూర్వకం అని పేర్కొనడం గమనార్హం. 
    

మరిన్ని వార్తలు