సోనూసూద్‌ కీలక నిర్ణయం.. పంజాబ్‌ స్టేట్‌ ఐకాన్‌కి గుడ్‌బై

8 Jan, 2022 07:47 IST|Sakshi

చంఢిఘర్‌: బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ సమయంలో ఎంతోమంది వలస కార్మికులు, కూలీలకు సాయం అందిచిన విషయం తెలిసిందే. కోవిడ్‌ కారణంగా సీరియస్‌గా ఉన్న పేషెంట్లకు వైద్య సదుపాయాలు అందించి పలువురి ప్రాణాలును కాపాడారు. అయితే ఆయన తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తాను పంజాబ్‌ ‘స్టేట్‌ ఐకాన్‌’గా ఉండబోనని సోనూసూద్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.
 

పంజాబ్‌ ఎన్నికల్లో భాగంగా​ ఎన్నికల సంఘం గతేడాది సోనూసూద్‌ను ‘స్టేట్‌ ఐకాన్‌’గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన సోదరి మాళవిక సూద్‌ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన స్టేట్‌ ఐకాన్‌ హోదా నుంచి తప్పుకున్నారు. 

‘స్టేట్‌ ఐకాన్‌గా నా ప్రయాణాన్ని ముగిస్తున్నా. స్వచ్ఛందంగా తాను ‘స్టేట్‌ ఐకాన్‌’ పదవి నుంచి వైదొలుగుతున్నా. ఎన్నికల సంఘంతో చర్చించి సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నా. నా సోదరి పంజాబ్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు’ అని సోనూ ట్విటర్‌లో పేర్కొన్నారు.

నవంబర్‌లో ఆయన సోదరి మాళవిక సూద్‌ పంజాబ్‌ అసెంబ్లీలో పోటీ చేయనున్నారని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఏ పార్టీ నుంచి ఆమె పోటీ చేస్తారన్న విషయంపై ఆయన స్పష్టత  ఇవ్వలేదు. అనంతరం పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ చన్నీతో కూడా భేటీ అయ్యారు. అయితే ఆయన సోదరి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయనున్నారని వార్తలు కూడా వచ్చాయి. అదేవిధంగా ఢిల్లీలో ‘దేశ్ కా మెంటర్స్’ అనే విద్యార్థుల సంబంధించిన ఓ కార్యక్రమానికి సోనూసూద్‌ను సీఎం కేజ్రీవాల్‌ అంబాసిడర్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే.   

మరిన్ని వార్తలు