ఆశలన్నీ అడియాశలు.. పాపం కుష్బూ!

12 Mar, 2021 06:41 IST|Sakshi
గౌతమి, కుష్బూ

చేపాక్కం, ట్రిప్లికేన్‌లో పోటీకి దూరం 

ఆయా నియోజకవర్గాలు అన్నాడీఎంకే వశం

గౌతమికీ తప్పని భంగపాటు

ఆశలన్నీ అడియాశలైన వైనం 

సాక్షి, చెన్నై: సినీ నటి కుష్బూకు బీజేపీలో కూడా గత అనుభవాలే ఎదురయ్యే పరిస్థితి ఉన్నట్టుంది. ఆరు నెలలుగా తానే ఎమ్మెల్యే అభ్యర్థి అన్నట్టుగా చేపా క్కం–ట్రిప్లికేన్‌ నియోజకవర్గంలో ఆమె పడ్డ శ్రమ బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. ఇదే పరిస్థి తి రాజపాళయంలో మరో నటి గౌతమికి తప్పలేదు. కుష్బూ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డీఎంకే, కాంగ్రెస్‌ ఎన్నికల్లో పోటీకి అవకాశం రాకున్నా, తాజాగా బీజేపీ రూపంలో తనకు ఆ చాన్స్‌ దక్కుతుందన్న ధీమాతో ఆరు నెలలుగా ఆమె ఉంటూ వచ్చారు. చేపాక్కం–ట్రిప్లికేన్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె పోటీచేయడం ఖాయం అన్న సంకేతాలు వినిపిస్తూ వచ్చాయి. ఇందుకు తగ్గట్టుగానే  ఆ నియోజకవర్గంలో తిష్ట వేసి, ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాల్లో కుష్బూ చేస్తూ వచ్చారు.

ఆ నియోజకవర్గం పరిధిలో సినీ తరహా సెట్టింగ్‌లతో ఎన్నికల కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ నాలుగు కంటైనర్లు ఏర్పాటు చేశారు. అందులో అన్ని రకాల వసతులతో ఎన్నికల పనుల వేగాన్ని కుష్బూ పెంచారు. నియోజకవర్గ ప్రజల్లో చొచ్చుకెళ్లే విధంగా ప్రతి రోజూ సేవా కార్యక్రమాలు, ప్రచారాలు, ర్యాలీలు అంటూ దూసుకెళ్లారు. ఆరు నెలలుగా ఆమె చేసిన సేవ ప్రస్తుతం బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. ఈ సీటును అన్నాడీఎంకే నుంచి రాబట్టుకోవడంలో బీజేపీ వర్గాలు విఫలమయ్యారు. దీంతో చేపాక్కం–ట్రిప్లికేన్‌లో పోటీ అన్న కుష్బూ ఆశ అడియాసలు కావడం ఆమె అభిమానుల్ని జీర్ణించుకోలేకుండా చేస్తున్నది.

గౌతమికి కూడా.... 
బీజేపీలో గౌతమి సీనియర్‌. ఆమె తర్వాత గాయత్రి రఘురాం, కుష్బూ, నమిత వంటి మహిళా తారలు బీజేపీలోకి వచ్చారు.  కుష్బూను చేపాక్కం ఇన్‌చార్జ్‌గా, గౌతమిని విరుదునగర్‌ జిల్లా రాజ పాళయం ఇన్‌చార్జ్‌గా బీజేపీ ప్రకటించింది. దీంతో రాజపాళయం నుంచి గౌతమి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం అన్నట్టుగా చర్చ సాగుతూ వచ్చింది. అయితే, ఈ సీటును కూడా అన్నాడీఎంకే నుంచి రాబట్టుకోవడంలో కమలనాథులు విఫలం అయ్యారు. ఇది గౌతమి అభిమానుల్నే కాదు, అక్కడ  ఆమెతో పాటు సేవల్లో నిమగ్నమైన వారిని జీరి్ణంచుకోలేకుండా చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో గురువారం గౌతమి ట్వీట్‌ అందర్నీ ఆలోచనలో పడేసింది.

ఐదు నెలలుగా ప్రతి ఇంట్లోనూ తనను ఓ బిడ్డగా, సోదరిగా చూసుకున్నారంటూ రాజపాళయం ప్రజ లకు గౌతమి కృతజ్ఞతలు తెలుపుకోవడం గమనార్హం అలాగే, మైలాపూర్‌ నుంచి బీజేపీ సీనియర్‌ కరు నాగరాజన్, తిరుత్తణి నుంచి మరో సీనియర్‌ చక్రవర్తినాయుడు పోటీ చేయవచ్చన్న చర్చ సాగినా, చివరకు ఆ సీట్లలో అన్నాడీఎంకే అభ్యర్థులు రంగంలోకి దిగడం ఆ నేతల మద్దతుదారుల్ని తీవ్ర నిరాశలోకి నెట్టాయి. కుష్బూ, గౌతమిలకు మరెక్కడైనా పోటీ చేసే అవకాశాన్ని బీజేపీ వర్గాలు కల్పించేనా లేదా, ఇతర పారీ్టలలో వీరికి ఎదురైన అనుభవాలు ఇక్కడ కూడా పునరావృతం అయ్యేనా  వేచి చూడాల్సిందే. ఈ పరిణామాల నేపథ్యంలో అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నుంచి బయటకు వచ్చిన సినీ హాస్య నటుడు సెంథిల్‌ గురువారం కాషాయం కండువా కప్పుకోవడం విశేషం.
చదవండి:
కాషాయ దళానికి 20 సీట్లు  
మళ్లీ జంగిల్‌ రాజ్‌ దిశగా బిహార్‌?

మరిన్ని వార్తలు