రాష్ట్రపతి అంటే మర్యాద లేకుండా మాట్లాడారు.. స్మృతి ఇరానీ క్షమాపణలు చెప్పాలి

31 Jul, 2022 15:58 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ లోక్‍సభాపక్షనేత అధిర్ రంజన్ చౌదరి. గురువారం పార్లమెంటులో రాష్ట్రపతి అంటే గౌరవం లేకుండా ఆమె మాట్లాడారని ఆరోపించారు. పదే పదే ద్రౌపది ముర్ము అని పిలిచారని,  పేరుకు ముందు రాష్ట్రపతి అని గానీ, మేడం, శ్రీమతి అని గానీ సంభోదించలేదని విమర్శించారు. ఈమేరకు అధిర్ రంజన్ చౌదరి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. రాష్ట్రపతి అంటే మర్యాద లేకుండా మాట్లాడినందుకు స్మృతి ఇరానీ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.

కాగా, గురువారమే పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతిని రాష్ట్రపత్ని అని సంభోదించారు అధిర్ రంజన్ చౌదరి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. రాష్ట్రపతిని అవమానించేలా మాట్లాడినందుకు అధిర్ రంజన్‌తో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్ పార్లమెంటు ఆవరణలో ఆందోళనలు కూడా చేపట్టారు. చివరకు అధిర్ రంజన్ చౌదరి వెనక్కితగ్గారు. క్షమాపణలు కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాశారు.
చదవండి: మీరు బతికున్నారంటే మోదీ చలవే.. 'డోసు' పెంచిన బిహార్ మంత్రి

మరిన్ని వార్తలు