పేదల చదువుకు చంద్రబాబే అడ్డంకి 

22 Jun, 2022 05:26 IST|Sakshi

నాణ్యమైన సాంకేతిక విద్య అందించడంలో పేరొందిన సంస్థ ‘బైజూస్‌’.. 

ఆ సంస్థ ఉచితంగా కంటెంట్‌ అందించేందుకు ముందుకొచ్చింది 

దానినీ చంద్రబాబు అవహేళన చేయడం దారుణం 

నారాయణ, చైతన్యకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ స్కూళ్లను చులకన చేస్తున్నారు 

మంత్రి ఆదిమూలపు సురేష్‌ ధ్వజం  

సాక్షి, అమరావతి: పేద విద్యార్థుల చదువుకు చంద్రబాబే ప్రధాన అడ్డంకి అని మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. కార్పొరేట్‌ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ.. ప్రభుత్వ స్కూళ్లను చులకనగా చూస్తున్నారని మండిపడ్డారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు సీఎం జగన్‌ కృషి చేస్తుంటే.. చంద్రబాబు, టీడీపీ నాయకులు  అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి మీడియాతో మాట్లాడారు.

ధనవంతులకే సొంతమైన ‘ఎడ్యు టెక్‌’ను ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకూ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బైజూస్‌తో ఒప్పందం చేసుకుందన్నారు. ఇది విద్యలో ఒక గేమ్‌ చేంజర్‌ అని.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గొప్ప అవకాశమన్నారు. ఒక్కో విద్యార్థి బైజూస్‌ కంటెంట్‌ను కొనాలంటే రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చవుతుందని చెప్పారు.

అలాంటిది సీఎం జగన్‌ చొరవ వల్ల ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ఉచితంగా తమ కంటెంట్‌ అందించేందుకు బైజూస్‌ సీఈవో రవీంద్రన్‌ ముందుకు వచ్చారన్నారు. నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడంలో ప్రపంచవ్యాప్తంగా బైజూస్‌కు మంచి పేరుందన్నారు.

ఇప్పటివరకు ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం వద్దన్న చంద్రబాబు.. ఇప్పుడు బైజూస్‌ పైనా తన అక్కసును వెళ్లగక్కుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ‘జూస్‌’ అంటూ అవహేళన చేస్తున్నారన్నారు. నారాయణ, చైతన్య తదితర కార్పొరేట్‌ విద్యాసంస్థలకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. 

మరిన్ని వార్తలు