ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ పీఏకు బంపర్‌ ఆఫర్‌  

29 May, 2022 15:09 IST|Sakshi
బాలకృష్ణ మాజీ పీఏ బాలాజీ (ఫైల్‌)

బాలకృష్ణ మాజీ పీఏకు వయోజన విద్య అధికారుల అండ 

రెండేళ్లుగా హాజరు పట్టిక, టూర్‌ గైడ్‌ లేకున్నా ఠంచనుగా జీతం 

సస్పెండ్‌ చేయాలని కలెక్టర్‌ ఉత్తర్వులిచ్చినా చర్యలు శూన్యం

సాక్షి, పుట్టపర్తి(శ్రీసత్యసాయి జిల్లా): సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ పీఏ బాలాజీకి వయోజన విద్యాశాఖ ఉన్నతాధికారులు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. విధులకు గైర్హాజరయినా ప్రతి నెలా ఠంచనుగా వేతనం ఖాతాలో వేశారు. పేకాటలో దొరికి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ కట్టినా... చర్యలు తీసుకోకుండా అండగా నిలుస్తున్నారు. సగటు ఉద్యోగి ఏ చిన్న తప్పుచేసినా క్రమశిక్షణ చర్యలు తీసుకుని సస్పెండ్‌ చేసే ఉన్నతాధికారులు... బాలాజీకి అండగా నిలవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చదవండి: మళ్లీ బాలకృష్ణ పీఏగా మారిన బాలాజీ.. గృహప్రవేశమని చెప్పి ఆఫీస్‌కు డుమ్మా కొట్టి

హాజరుతో సంబంధం లేకుండా జీతం.. 
వయోజన విద్య పెనుకొండ డివిజన్‌ సూపర్‌వైజర్‌గా పనిచేసే బాలాజీ డిప్యుటేషన్‌పై ఆరేళ్ల క్రితం బాలకృష్ణ పీఏగా నియమితులయ్యారు. అయినప్పటికీ అతను ప్రతి నెలా బాలకృష్ణ వద్ద విధులు నిర్వహిస్తున్నట్లు హాజరుపట్టిక, టూర్‌గైడ్‌ను విధిగా వయోజన విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపాలి. కానీ రెండేళ్లుగా టూర్‌గైడ్, హాజరు పట్టిక పంపకపోయినా వయోజన విద్యాశాఖ అధికారులు ప్రతి నెలా బాలాజీకి జీతం మంజూరు చేశారు.

పేకాట ఆడినా చర్యలు శూన్యం.. 
ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ బాలాజీ టీడీపీ నాయకుడిలా వ్యవహరించేవారు. టీడీపీ కార్యక్రమాలు, ఆ పార్టీ సమాచారాన్ని నేరుగా వాట్సాప్‌ గ్రూపుల్లో అందరికీ పంపేవాడు. అయినప్పటికీ అతనిపై అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఈ ఏడాది మార్చి 20న గౌరీబిదనూరులో పేకాట ఆడుతూ పట్టుబడగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి అరెస్టు చేయడంతో పాటు రిమాండ్‌కు పంపగా.. అతను బెయిల్‌ తెచ్చుకున్నాడు. దీంతో అనంతపురం జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ... బాలాజీని సస్పెండ్‌ చేయాలని సిఫార్సు చేస్తూ వయోజన విద్యాశాఖకు ఉత్తర్వులు ఇచ్చారు.

బాలకృష్ణ పీఏగా రిలీవ్‌ చేసి వయోజన విద్యాశాఖకు సరెండర్‌ చేశారు. కానీ అధికారులు మాత్రం ఇప్పటి వరకు బాలాజీని సస్పెండ్‌ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. భోజనం చేస్తుంటే కర్ణాటక పోలీసులు అరెస్ట్‌ చేశారని... పేకాట ఆడలేదని తప్పుడు నివేదికను వయోజన విద్యాశాఖ డైరెక్టర్‌కు పంపి.. కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. కర్ణాటక పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ కట్టినా... అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ, మభ్యపెట్టి చర్యలు తీసుకోకుండా కాపాడే ప్రయత్నం జరుగుతున్నట్లు వయోజన విద్యాశాఖలో చర్చ జరుగుతోంది. 

మరిన్ని వార్తలు