మళ్లీ బాలకృష్ణ పీఏగా మారిన బాలాజీ.. గృహప్రవేశమని చెప్పి ఆఫీస్‌కు డుమ్మా కొట్టి

28 May, 2022 16:17 IST|Sakshi
చిలమత్తూరు వద్ద ఎమ్మెల్యే బాలకృష్ణ పక్కన∙ఉన్న బాలాజీ

హిందూపురం(శ్రీసత్యసాయి జిల్లా): వయోజన విద్య సూపర్‌వైజర్‌ బాలాజీ... స్వామి భక్తి చాటుకునేందుకు సెలవు చీటీ పెట్టారు. బంధువుల గృహప్రవేశమని చెప్పి కార్యాలయానికి డుమ్మా కొట్టిన ఆయన శుక్రవారం ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటనలో కీలకంగా వ్యవహరించారు. వయోజన విద్యలో విధులు నిర్వహిస్తున్న ఆయన్ను ఆరేళ్ల క్రితం ప్రభుత్వం డిప్యుటేషన్‌పై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏగా నియమించింది. అప్పటి నుంచి రాజకీయ నేత అవతారమెత్తారు.
చదవండి: ‘ఆ దెబ్బకి చంద్రబాబు కర్ణభేరి పగిలిపోయింది’

అన్నీ తానై టీడీపీ నేతలా ఆ పార్టీ కార్యక్రమాలు, ప్రచారం నిర్వహిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చి 20వ తేదీన కర్ణాటక సరిహద్దులోని గౌరీబిదనూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో బాలాజీపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపగా... కోర్టు నుంచి బెయిల్‌ తెచ్చుకున్నాడు. దీంతో అనంతపురం జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ మార్చి 30వ తేదీన బాలాజీని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ విధుల నుంచి తప్పించి.. ఆయన మాతృశాఖ వయోజన విద్యకు సరెండర్‌ చేశారు.

అయినప్పటికీ బాలాజీ టీడీపీ వాట్సాప్‌ గ్రూపుల్లో టీడీపీకి సంబంధించిన రాజకీయ పరమైన పోస్టులు, వ్యవహారాలు ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు అందినా అధికారులు పట్టించుకోలేదు.  తాజాగా శుక్రవారం ఎమ్మెల్యే బాలకృష్ణ జిల్లాకు రాగా.. బాలాజీ మళ్లీ వ్యక్తిగత సహాయకుడిగా మారారు. దీనిపై వయోజన విద్య ఇన్‌చార్జ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వెంకటేష్‌ను వివరణ కోరగా... బాలాజీ శుక్రవారం సెలవు తీసుకున్నారని, గృహప్రవేశం ఉన్నట్లు సెలవు చీటీలో పేర్కొన్నారని తెలిపారు.  

మరిన్ని వార్తలు