నేను వజ్రాన్ని... మోసగాణ్ని కాదు: పుట్ట మధు

21 Feb, 2021 04:04 IST|Sakshi
శనివారం మంథనిలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాట్లాడుతున్న పుట్ట మధు 

కాంగ్రెస్‌ కుట్రలకు మీడియా తోడైంది.. 

సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదంటూ అసత్య ప్రచారం 

మంథని ఎమ్మెల్యే కొందరిని కొనుగోలు చేశారు 

మీడియాపై జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధుకర్‌ ఆగ్రహం 

న్యాయవాద దంపతుల హత్యపై తొలిసారి స్పందన 

సాక్షి, కరీంనగర్‌: మంథని నియోజకవర్గానికి 70 ఏళ్ల తర్వాత ఓ గరీబ్‌ బిడ్డ ఎమ్మెల్యే అయితే అగ్రవర్గాలు తట్టుకోలేదని, ఇప్పుడు జెడ్పీ చైర్మన్‌ అయ్యాక మరింత బురదజల్లుతున్నారని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధుకర్‌ పేర్కొన్నారు. ‘నేను వజ్రం లాంటి వాడిని.. మోసగాడిని కాదు’అంటూ వ్యాఖ్యానించారు. మంథనిలో శనివారం జరిగిన టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ.. తనను కేసులో ఇరికించాలని కాంగ్రెస్‌ కుట్ర చేస్తోందని, ఇందుకు మీడియా తోడైందని ధ్వజమెత్తారు. తనను కొంద రు మీడియా మిత్రులు సంప్రదించగా ‘పోలీసుల విచారణ జరుగుతోంది. మా మండల పార్టీ అధ్యక్షుడి పేరు చనిపోయిన అతడు చెప్పాడు. ఏమైందో పోలీసులు తేలుస్తారు. విచారణ అనంతరమే స్పందిస్తా’ అని చెప్పగా.. మొహం చాటేసినట్లు ఓ టీవీ చానల్‌ ప్రసారం చేసిందని మండిపడ్డారు.

‘నేను నియోజకవర్గంలోనే తిరుగుతుంటే హైదరాబాద్‌ పరారైనట్లు వార్తలు వేస్తున్నారు. వారికేమైనా మెదడుందా? నేను ఇక్కడే ఉన్న. నిన్న మంత్రి వచ్చిండంటే పెద్దపల్లికి పోయి వచ్చిన’ అని ధ్వజమెత్తారు. ‘హైదరాబాద్‌లో కూర్చొని వార్తలు రాస్తున్నారా? పోలీస్‌ వాళ్లను పక్కన బెట్టి మీరే ఎంక్వైరీ చేస్తారా?’అంటూ వ్యాఖ్యానించారు. తాను కేసీఆర్, కేటీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నానని, వారు తనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వట్లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. తనపై కొన్ని పత్రికలు, టీవీ చానెళ్లు ఎందుకు కక్షగట్టాయో అర్థం కావట్లేదని చెప్పారు. తనపై దుష్ప్రచారం చేసేందుకు మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు కొందరిని కొనుగోలు చేశాడంటూ విమర్శించారు. పోలీసుల విచారణ జరుగుతున్నప్పుడే మీడియా సమాంతర విచారణ చేస్తున్నారని ఆరోపించారు.

‘నన్ను లోపల వేయించేందుకు మీడియా ఆరాటపడుతోంది. మీరే ఓ దరఖాస్తు పెట్టి ఆ పని చేయండి’ అని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో నిత్యం ప్రజా సంక్షేమ, పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతుంటే నాపై, నా కుటుంబంపై ఎందుకు విషం కక్కుతున్నారంటూ మీడియాపై నిప్పులు చెరిగారు. పోలీసుల విచారణ పూర్తయ్యాక హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసినా తనపై విషం చిమ్మిన పత్రికలు, చానల్స్‌ వ్యవహరంపై ఆధారాలతో మాట్లాడుతాన ని ‘నేను ఎన్నడూ రౌడీయిజం చేయలేదు. నువ్వు, నీ తమ్ముడు చేశారు’అంటూ శ్రీధర్‌బాబు, శ్రీనుబాబులను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు.  

చదవండి: (ఆ హత్యల కేసులో ఎంతటివారున్నా వదలం)

(దంపతుల హత్య: ఆ సమాచారం ఇచ్చింది లచ్చయ్య)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు