అవి డొల్ల కమిటీలేనా?

24 Sep, 2023 03:28 IST|Sakshi

బీజేపీ నాయకత్వానికి షాకిచ్చిన బూత్‌కమిటీల వ్యవహారం

చాలా చోట్ల బూత్‌కమిటీ అధ్యక్షులే లేని వైనం

కమిటీ సభ్యుల్లో చాలా మంది చురుకుగా లేరని పరిశీలనలో వెల్లడి

బీజేపీ ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేల పర్యటనల్లో బయట పడిన వాస్తవం

అర్జంట్‌గా పరిస్థితిని చక్కదిద్దేందుకు సిద్ధమైన నాయకత్వం

సాక్షి, హైదరాబాద్‌: సంస్థాగతంగా పార్టీ పటిష్టతకు, ఎన్నికల్లో బూత్‌ల వారీగా పైచేయి సాధనకు పోలింగ్‌బూత్‌ కమిటీలే కీలకమని బీజేపీ గట్టిగా విశ్వసిస్తోంది. అయితే పార్టీకి పోలింగ్‌బూత్‌ కమిటీలే బలమనుకుంటే.. చాలా చోట్ల బూత్‌కమిటీ అధ్యక్షులే లేరని, కమిటీ సభ్యుల్లో చాలా మంది చురుకుగా పనిచేయడం లేదని ముఖ్యనేతల పరిశీలనలో వెల్లడైనట్లు తెలుస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల 119 నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు పర్యటించిన సందర్భంగా వారు రూపొందించిన నివేదికల్లోనూ ఇదే విషయం బయట పడిందని వెల్లడైంది. ఈ నివేదికలు, ఇతరత్రా అందిన సమాచారం మేరకు.. క్షేత్రస్థాయిలో పరిస్థితి, పోలింగ్‌ బూత్‌ కమిటీల తీరు గురించి క్రాస్‌ చెక్‌ చేసినపుడు కూడా ఇదే విషయం తేలడంతో పార్టీ ముఖ్యనేతలకు కలవరం మొదలైందని సమాచారం.

బూత్‌ కమిటీల్లో చాలాచోట్ల పోలింగ్‌ బూత్‌ అధ్యక్షులే లేరని, ఈ జాబితాల్లో పేర్లు ఉన్న వారిలో చాలామంది ప్రస్తుతం చురుకుగా పనిచేయకపోవడం, పలుచోట్ల బూత్‌ కమిటీ సభ్యులు కూడా మొక్కుబడిగా పనిచేయడం, పార్టీలో లేనివారి పేర్లు కమిటీల్లో చోటుచేసుకోవడం వంటివి బయటపడడంతో అర్జంట్‌గా ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు నాయకత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

క్షేత్రస్థాయి పరిశీలనకు 450 మంది.. 
రాష్ట్రంలో బూత్‌కమిటీల నియామకానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, సంస్థాగత ఇన్‌చార్జి సునీ­ల్‌ బన్సల్‌ ఈ వ్యవహారాన్ని సీరి­యస్‌గా తీసుకున్నట్టు సమాచారం. ఈ నెల 26 నుంచి 19 రోజులపాటు రాష్ట్రంలో మూడుచోట్ల నుంచి బస్సు (రథ)యాత్రలు ప్రారంభించి, అక్టోబర్‌ 14న హైదరాబా­ద్‌లో ముగింపు సందర్భంగా ప్రధాని మోదీని ఆహ్వానించి బహిరంగసభ నిర్వ­హిం­చాలని ముఖ్యనే­తలు నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయం రద్దు చేసుకున్నారు. ఇదిలా ఉండగా పోలింగ్‌ బూత్‌కమిటీలు సరిగా లేకపోవడమే దీనికి కారణమని విశ్వసనీయ సమాచారం.

బూత్‌ కమిటీలు సక్రమంగా లేకుండా బస్సు­యాత్రలు ఎలా విజయవంతం అవుతా­యని బన్సల్‌ రాష్ట్రనే­తలను నిలదీసినట్టు తెలిసింది. దీనిని సీరియస్‌ తీసుకున్న బన్సల్‌.. ఈ నెల 26 నుంచి వచ్చేనెల 2 దాకా రెండేసి మండ­లాల చొప్పున పరిశీలించి నివేదికల సమ­ర్పణకు 450 మందిని క్షేత్రస్థాయి పర్య­టనలకు సిద్ధం చేసినట్టు పార్టీవర్గాల సమా­చారం.

వారికి అప్పగించిన మండలాలలో బూత్‌ కమిటీ అధ్యక్షుడు ఉన్నాడా, కమి­టీలు ఉన్నాయా, శక్తి కేంద్ర ఇన్‌చార్జి ఉన్నా­డా, మండల కమిటీ ఉందా, ఎంత మందితో ఉంది.. వంటి అంశాలను వారు లోతుగా పరిశీలించనున్నారు. రాష్ట్ర పార్టీ సిద్ధం చేసిన నమూనాకు అనుగుణంగా పోలింగ్‌బూత్‌ అధ్యక్షులు, కమిటీలపై వీరు నివేదికను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్‌చా­ర్జిలతో మాట్లాడిన బన్సల్‌.. రాజకీయ కార్యక్రమాలను తగ్గించి సంస్థాగత విష­యా­లపై దృష్టి పెట్టాలని ఆదేశించినట్టు తెలిసింది. చురుగ్గా పార్టీ కార్యక్ర­మాల్లో పాల్గొనని పక్షంలో పార్టీ మండలా«­ద్యక్షులను కూడా మార్చాలని, బూత్‌కమి­టీలకు కొత్త అధ్యక్షులను నియమించాలని ఆయన సూచించినట్టు తెలిసింది. 

మరిన్ని వార్తలు