కశ్మీర్ లోయలో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ.. ఆజాద్ వెంటే కార్యకర్తలంతా!

30 Aug, 2022 12:20 IST|Sakshi

శ్రీనగర్‌: కాంగ్రెస్‌తో 50 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుని సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈయన నిష్క్రమణతో జమ్ముకశ్మీర్‌లో హస్తం పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. అక్కడ ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్‌ నేతలు పార్టీని వీడారు. ఆజాద్ స్థాపించబోయే పార్టీలో చేరుతామని స్పష్టం చేశారు.

కాగా.. మంగళవారం ఏకంగా 100 మంది కాంగ్రెస్ నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నారు. జమ్ముకశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం తారా చంద్ సహా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉన్నారు.

జమ్ముకశ్మీర్ కాంగ్రెస్‌లో దాదాపు 95శాతం మంది కార్యకర్తలు తనవెంటే వస్తారని ఆజాద్ చెబుతున్నారు. పంచాయతీ, డీసీసీ సభ్యులు కూడా తన కొత్త పార్టీలో చేరుతారని పేర్కొన్నారు. ఆజాద్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత చాలా మంది కశ్మీర్ కాంగ్రెస్ నేతలు పార్టీని వీడుతామని బహిరంగంగా ప్రకటించారు.

చెత్తతో సమానం
మరోవైపు కశ్మీర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వికార్ రసూల్ ఆజాద్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆజాద్‌కు కూడా కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు పట్టిన గతే పడుతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ను వీడిన వారు తమకు చెత్తతో సమానమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొత్త నాయకులు, కొత్త విజన్‌తో పార్టీకి పునరుత్తేజం తీసుకొస్తామన్నారు.

బీజేపీతో కలవను
రాజీనామా అనంతరం తాను కొత్త పార్టీ స్థాపించబోతున్నట్లు ఆజాద్ ప్రకటించారు. తాను బీజీపీతో కలిసే అవకాశమే లేదన్నారు. కశ్మీర్‌పై కనీస అవగాహన ఉన్నవారిని ఎవర్ని అడిగినా.. బీజేపీతో తాను కలిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదనే చెబుతారని పేర్కొన్నారు.  ఎవరి ఓటు బ్యాంకు వాళ్లకు ఉందని వివరించారు.
చదవండి: అసెంబ్లీలో ఆప్ ఎమ్మెల్యేల జాగారం.. రాత్రంతా నిరసనలే..

మరిన్ని వార్తలు