ట్విస్ట్‌ ఇచ్చిన అఖిలేష్‌.. ‘యోగితో ఇక తాడో పేడో తేల్చుకుంటా’

22 Mar, 2022 15:37 IST|Sakshi

ఉత్తర ప్రదేశ్‌ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అధికారంలోకి రాకపోవడంతో.. ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేసి ఎంపీగానే కొనసాగుతాడంటూ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ఓ పుకారు వినిపించింది. అయితే ఆ ఊహాగానాల్ని పటాపంచల్‌ చేస్తూ.. ఎంపీ పదవికే రాజీనామా చేశారాయన. 

మంగళవారం మధ్యాహ్నాం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కార్యాలయానికి వెళ్లిన అఖిలేష్‌.. తన సభ్యత్వానికి రాజీనామాను సమర్పించారు. యూపీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కార్హల్‌ నిజయోకవర్గం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన విజయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్‌లో అధికారంలోకి రాకపోయినా.. ప్రజా తీర్పును శిరసావహిస్తానని, ప్రతిపక్ష హోదా దక్కడంతో ఇకపై యోగి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటానని అన్నారాయన. అసెంబ్లీలో యోగి సర్కార్‌తో తాడో పేడో తేల్చుకునేందుకే తాను ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. 

బీజేపీ అభ్యర్థి సింగ్‌ బాఘెల్‌పై ఆయన 67 వేల ఓట్లకు పైగా తేడాతో గెలుపొందారు అఖిలేష్‌.  యూపీ మాజీ సీఎం అయిన అఖిలేష్‌ యాదవ్‌.. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో అజాంఘడ్‌ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు.

మరిన్ని వార్తలు