బీఆర్‌ఎస్‌.. పట్టు బిగించేందుకు..  కాంగ్రెస్‌..  పాగా వేసేందుకు...

21 Oct, 2023 02:45 IST|Sakshi

ఉనికి చాటేందుకు కమలనాథుల కసరత్తు

మెతుకుసీమ ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మరోసారి పట్టు నిలుపుకునేందుకు అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ దూకుడుగా ముందుకెళుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా పాగా వేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఉనికిని చాటుకునేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది.

బీఆర్‌ఎస్‌ దూకుడు... 
ఉమ్మడి మెదక్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీకి కంచుకోటగా పేరుంది. ఈఎన్నికల్లో కూడా జిల్లాను క్లీన్‌ స్వీప్‌ చేయాలనే తపనతో బీఆర్‌ఎస్‌ దూకుడు ప్రదర్శిస్తోంది. 2018 ఎన్నికల్లో ఒక్క సంగారెడ్డి మినహా, మిగిలిన తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి పదికి పది స్థానాలను గెలుచుకోవాలని పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. ఒక్క నర్సాపూర్‌ మినహా ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థిత్వాలను ప్రకటించింది.

సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పేరుతో అభ్యర్థులు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లారు. ఒకటికి రెండుసార్లు నియోజకవర్గాన్ని చుట్టేశారు. ఇతర పార్టీల నుంచి భారీ చేరికలతో బీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతోందనే సంకేతాలను క్షేత్రస్థాయికి పంపారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తూ పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టారు.  

చేరికలతో పకడ్బందీగా కాంగ్రెస్‌.. 
ఉమ్మడి మెదక్‌లో పాగా వేసేందుకు హస్తం పార్టీ పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా లో సంగారెడ్డిని మాత్రమే కాంగ్రెస్‌ తన ఖాతాలో వేసుకోగలిగింది. ఇక్కడ జగ్గారెడ్డి విజయం సాధించారు. ఈసారి జిల్లాలో అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు పకడ్బందీ ప్రణాళికను అమలు చేస్తోంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్, ఆయన కుమారుడు రోహిత్‌కు మెదక్‌ అభ్యర్థిత్వం ఖరారు చేసింది.

అలాగే బీజేపీకి చెందిన మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్‌కు గాలం వేసిన కాంగ్రెస్‌.. ఆయనకు జహీరాబాద్‌ టికెట్‌ ప్రకటించింది. కాంగ్రెస్‌ ముఖ్యనేతలు  దామోదర రాజనర్సింహ ఆందోల్‌ నుంచి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి సంగారెడ్డి నుంచి బరిలోకి దిగారు. మిగిలిన నియోజకవర్గాల అభ్యర్థిత్వాలపై తకరారు కొనసాగుతోంది. 

బరిలో అగ్రనేతలు..
గజ్వేల్‌ నుంచి సీఎం కె.చంద్రశేఖర్‌రావు, సిద్దిపేట నుంచి రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు, అందోల్‌ నుంచి సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తదితర అగ్రనేతలు ఈసారి కూడా బరిలోకి దిగుతున్నారు. సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌ నుంచి మూడోసారి పోటీ చేస్తుండగా, ఈసారి ఆయన ఈ స్థానంతో పాటు, కామారెడ్డి నుంచి కూడా బరిలో నిలుస్తున్నారు. 

రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సాధిస్తున్న మంత్రి హరీశ్‌రావు ఈసారి కూడా ఇదే హవాను కొనసాగించేలా ముందుకు సాగుతున్నారు.  గత ఎన్నికల్లో భారీగా 1.18 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన మంత్రి హరీశ్‌రావు ఈసారి అంతకు మించి మెజారిటీ సాధిస్తామన్న ధీమాతో ఉన్నారు. ఇక వరుసగా రెండు పర్యాయాలు ఓటమిని చవిచూస్తున్న దామోదర్‌ ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. 
ప్రచార శంఖారావం ఇక్కడి నుంచే.. సెంటిమెంట్‌ మేరకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌ బహిరంగసభతోనే ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు.  

బలమైన నేతల కోసం బీజేపీ ఎదురుచూపులు.. 
దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కమలం పార్టీ ఈ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో తన ఉనికిని చాటుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయితే నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. దీంతో పలుచోట్ల బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు ఆశించి., భంగపడిన నాయకులకు బీజేపీ గాలం వేస్తోంది. వారిని పార్టీలో చేర్చుకుని అభ్యర్థులుగా బరిలోకి దింపేందుకు వ్యూహాలను రచిస్తోంది. 

సీపీఐ హుస్నాబాద్‌ అడిగినా..  
కాంగ్రెస్‌తో వామపక్షాల పొత్తుపై జాతీయ స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. పొత్తులో భాగంగా హుస్నాబాద్‌ నియోజకవర్గాన్ని సీపీఐ అడిగింది. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి పోటీ చేయాలని భావించారు. అయితే ఈ అసెంబ్లీ  సెగ్మెంట్‌ సీపీఐకి కేటాయిస్తారా, కాంగ్రెస్‌ పోటీలో 
ఉంటుందా చూడాలి.

బీఆర్‌ఎస్‌ది అభివృద్ధి నినాదం.. 
 సిద్దిపేట సర్వతోముఖాభివృద్ధి 
 మెదక్‌కు రైలుమార్గం, మెదక్‌ జిల్లా కేంద్రం ఏర్పాటు. 
  సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం 

విపక్షాల ప్రచార అస్త్రాలు 
  దళితబ0ధు అమలులో అవినీతి అక్రమాలు.     
​​​​​​​  బీసీబంధు, మైనార్టీబంధు అందరికీ అందకపోవడం. 
​​​​​​​  అందోల్‌ ప్రాంతంలో అధ్వానంగా రహదారులు. 
​​​​​​​  బీఆర్‌ఎస్‌ నేతలపై భూకబ్జాల ఆరోపణలు, అవినీతి అక్రమాలు. 
​​​​​​​  విచ్చలవిడిగా సాగిన అక్రమ మైనింగ్‌ 

సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే..  
జహీరాబాద్‌లో మైనార్టీల ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నారాయణఖేడ్‌లో ఎస్టీలు, మిగతా చోట్ల ఎస్సీలు, బీసీల ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా ముదిరాజ్‌లు, లింగాయత్, పద్మశాలి, గౌడ్‌ వంటి సామాజికవర్గాలు జిల్లాలో అధికంగా ఉన్నారు.  

ఏడాదికో ఉపఎన్నిక  
మంచిర్యాల డెస్క్‌:   2018లో జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పడిన పరిణామాలతో ఏడాదికో ఉపఎన్నిక అనివార్యమైంది. 
2019లో..: హుజూర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో  ఎంపీగా గెలిచారు. దీంతో ఉప ఎన్నిక జరగ్గా,  ఆయన భార్య పద్మావతిరెడ్డి కాంగ్రెస్‌ నుంచి బరిలో ఉండగా,  టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసిన శానంపూడి సైదిరెడ్డి గెలిచారు.
2020లో..: దుబ్బాక టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఆయన భార్య సుజాత పోటీ చేయగా,  ఆమెపై బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. 
2021లో..: నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అనారోగ్యంతో మరణించగా, జరిగిన ఉపఎన్నికలో ఆయన కుమారుడు భగత్‌ టీఆర్‌ఎస్‌ నుంచే పోటీ చేసి, జానారెడ్డిపై  గెలిచారు. 
2021లో..: హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక రాగా,  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ పై బీజేపీ నుంచి పోటీ చేసి ఈటల  గెలిచారు.  
2022లో..: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నికరాగా, ఆయనపై బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలిచారు.
​​​​​​​ ఇక 2023 నవంబర్‌ 30న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి.   


- పాత బాలప్రసాద్‌  

మరిన్ని వార్తలు