Agnipath Scheme: కాంగ్రెస్‌ సత్యాగ్రహం

20 Jun, 2022 04:57 IST|Sakshi
నిరసన కార్యక్రమంలో ప్రియాంక

జంతర్‌ మంతర్‌ వద్ద నేతల నిరసన  

సాక్షి, న్యూఢిల్లీ: అగ్నిపథ్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్‌ సత్యాగ్రహం చేపట్టింది. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆదివారం నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా మాట్లాడుతూ... నకిలీ జాతీయవాదులను, నకిలీ దేశభక్తులను గుర్తించాలని యువతకు పిలుపునిచ్చారు. అసలైన దేశభక్తిని ప్రదర్శించే ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కోరారు.  జైరాం రమేష్, రాజీవ్‌ శుక్లా, సచిన్‌ పైలట్, సల్మాన్‌ ఖుర్షీద్, దిగ్విజయ్‌ సింగ్, హరీశ్‌ రావత్, రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జేడీ శీలం, కొప్పుల రాజు, వంశీచంద్‌రెడ్డి, రుద్రరాజు పాల్గొన్నారు.

నేడు కాంగ్రెస్‌ దేశవ్యాప్త శాంతియుత ర్యాలీలు  
అగ్నిపథ్‌ కార్యక్రమంతోపాటు, తమ నేత రాహుల్‌ లక్ష్యంగా మోదీ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరసిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా లక్షలాదిగా తమ కార్యకర్తలు శాంతియుతంగా ర్యాలీలు చేపడతారని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. ఇదే విషయమైన పార్టీ ప్రతినిధి బృందం సోమవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలుస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఆదివారం ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.   

బిహార్‌లో 804 మంది అరెస్ట్‌
అగ్నిపథ్‌పై  హింసాత్మక నిరసనలకు పాల్పడిన 804 మందిని అరెస్ట్‌ చేసినట్లు బిహార్‌ పోలీసులు తెలిపారు. 145 మందిపై కేసులు నమోదు చేశామన్నారు.  రాష్ట్రంలోని  17 జిల్లాల్లో ఇంటర్నెట్‌ సేవలపై నిషేధం కొనసాగుతోంది.  గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పోలీసులు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. యూపీలో 34 కేసులు నమోదు చేసి, 387 మందిని అదుపులోకి తీసుకున్నారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు వ్యాప్తి చేసినట్లు గుర్తించిన  35 వాట్సాప్‌ గ్రూపులపై నిషేధం విధించినట్లు కేంద్రం తెలిపింది.   ఆందోళనల కారణంగా దేశవ్యాప్తంగా 483 రైలు సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది.  

మరిన్ని వార్తలు