అగ్నిపథ్‌ నిరసనలపై కేటీఆర్‌ స్పందన.. ఏకపక్ష నిర్ణయాల వల్లే అంటూ ఫైర్‌

17 Jun, 2022 19:00 IST|Sakshi

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ ‘అగ్నిపథ్‌’ నిరసనలతో బీజేపీపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  వన్ ర్యాంక్-వన్ పెన్షన్ నుంచి ఆర్మీని ఇవాళ నో ర్యాంక్ –నో పెన్షన్ స్థాయికి దిగజార్చిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్, కేంద్రంపై మండిపడ్డారు. 

‘‘జై జవాన్-జై కిసాన్ అని నినదించిన ఈ దేశంలో.. మెన్నటిదాకా నల్ల రైతుచట్టాలతో రైతులను గోసపుచ్చుకుంది కేంద్రం. ఇప్పుడు అదే విధానంతో జవాన్లను నిర్వేదంలోకి నెడుతోంది. వన్ ర్యాంక్-వన్ పెన్షన్ నుంచి ఆర్మీని ఈ రోజు నో ర్యాంక్ –నో పెన్షన్ స్థాయికి దిగజార్చిందని కేంద్రంపై కేటీఆర్ మండిపడ్డారు.

..దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్న యువత ఆగ్రహానికి ఆందోళనలకు కేంద్రానిదే పూర్తి బాధ్యత. భారతదేశం ప్రజాస్వామ్య దేశం అనే విషయాన్ని మరిచి ఏకపక్షంగా, నియంతృత్వం మాదిరి ఎలాంటి చర్చలు లేకుండా కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ప్రజలకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి. రైతులను సంప్రదించకుండా నల్ల చట్టాలు, వ్యాపారులను సంప్రదించకుండా జీఎస్టీ.. 

అలాగే దేశపౌరుల బాధలను పరిగణలోకి తీసుకోకుండా డీమానిటైజేషన్, లాక్‌డౌన్, మైనార్టీలతో చర్చించకుండా సిఏఏ లాంటి నిర్ణయాలు తీసుకొని.. దేశాన్ని సంక్షోభంలోకి నెట్టింది కేంద్రంలోని నియంతృత్వ బీజేపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రతిపాదించిన అగ్నిపథ్ పథకం పున సమీక్ష చేయాలి అని మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు