రైతుల కోసం నిధులు లేవా? 

14 Nov, 2021 01:04 IST|Sakshi

కేంద్రానికి వ్యవసాయ మంత్రి నిరంజన్‌ రెడ్డి ప్రశ్న

రైతు సమస్యలపై త్వరలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో సీఎం చర్చ

గుజరాత్‌ సీఎంగా మోదీ కేంద్రంపై 51 గంటల దీక్ష చేశారు

సాక్షి, హైదరాబాద్‌: ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల ఆందోళన తీవ్రరూపం దాల్చకముందే కేంద్ర ప్రభు త్వం నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు నిధులు ఖర్చు చేసే స్తోమత కేంద్రానికి లేదా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో నిరంజన్‌రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు.

రైతులను ఇబ్బందులకు గురిచేసి దెబ్బతిన్న చరిత్రను కేంద్ర ప్రభుత్వం నెమరు వేసుకోవాలని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటిస్తున్న విధానాలను అదే పా ర్టీకి చెందిన రాష్ట్ర నేతలు అపహాస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. భారత్‌లో అనేకమంది ఆహార కొరతతో బాధ పడుతున్నారని, దేశంలో ధాన్యం నిల్వలు పేరు కుపోతున్నా పేదలకు ఎందుకు పంపిణీ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.

గతంలో విదేశాలకు బియ్యం ఎగుమతి చేస్తే ఇచ్చిన 5 శాతం ప్రోత్సాహకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. కొత్త వ్యవసాయ విధానాలను అవలంబించాలని ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అవగాహన కల్పిస్తున్నా, పంటల మార్పిడి కోసం కేంద్రం ప్రోత్సాహకాలు ఎందుకు ప్రకటించడం లేదని మంత్రి ప్రశ్నించారు. యాసంగిలో బాయిల్డ్‌ బియ్యాన్ని కొనబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటన ఇస్తే రైతులు, రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత వస్తుందన్నారు.  

పంటల సాగుపై కేంద్రానికి విధానం లేదు 
రాష్ట్రాల వారీగా సాగయ్యే పంటల విషయంలో కేంద్ర ప్రభుత్వం వద్ద ఎలాంటి విధానం లేదని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం టీఆర్‌ఎస్‌ అధ్వర్యంలో జరిగిన మహాధర్నాపై కాంగ్రెస్‌ శాసన సభాపక్షం నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. నల్లచట్టాలకు కాంగ్రెస్‌ పునాదులు వేస్తే, మోదీ ప్రభుత్వం వాటిని అమలు చేస్తోందన్నారు.

శుక్రవారం తమ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా రైతుల కోసం చేశామని, గతంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో నరేంద్ర మోదీ 51 గంటల దీక్ష చేసిన విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తు చేసుకోవాలన్నారు. రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో చర్చిస్తారని, త్వరలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ రైతాంగ సమస్యలే ప్రధాన ఎజెండాగా ఉంటాయని వెల్లడించారు.  

రైతులు చైతన్యమైతే అద్భుతాలు సృష్టించవచ్చు: నిరంజన్‌రెడ్డి 
రైతులను చైతన్యం చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చునని, వరి సాగు నుంచి రైతుల దృష్టి మళ్లించాలని నిరంజన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. శనివారం హైదరాబాద్‌లోని ఉద్యాన శిక్షణా సంస్థలో జిల్లా వ్యవసాయాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. అధికారులు మనసుపెట్టి పనిచేస్తే పంటల మార్పిడి వైపు రైతులను మళ్లించడం అసాధ్యమేమీ కాదన్నారు. ఆముదాలకు అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉందని, రైతులు కుసుమలు, ఆముదాల సాగును తిరిగి చేపట్టేలా చూడాలని సూచించారు.

ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించడంలో వ్యవసాయ, ఉద్యాన అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పప్పుగింజలు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలకు మార్కెట్లో డిమాండ్‌ ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ప్రత్యేక కమిషనర్‌ హన్మంతు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు