పార్టీ విజయానికి సమష్టిగా పనిచేద్దాం

17 Oct, 2020 06:11 IST|Sakshi
పన్నీర్‌సెల్వం, పళనిస్వామి

అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంకండి

పార్టీ స్వర్ణోత్సవంలో విజయఢంకా మోగిద్దాం

అన్నాడీఎంకే శ్రేణులకు ఈపీఎస్, ఓపీఎస్‌ సంయుక్త లేఖ

సాక్షి, చెన్నై: పార్టీ ప్రస్థానంలో వచ్చే ఏడాది ఎంతో ముఖ్యమైందని,  అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించడం ద్వారా చరిత్ర సృష్టిద్దామని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్, పన్నీర్‌సెల్వం, కో–కన్వినర్‌ ఎడపాడి పళనిస్వామి పార్టీ శ్రేణులకు శుక్రవారం లేఖ రాశారు. అన్నాడీఎంకే 49వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శనివారం జరుపుకోనున్న సందర్భంగా వారిద్దరూ రాసిన లేఖలోని వివరాలు ఇలా ఉన్నాయి.

‘ప్రాణాల కంటే మిన్నగా కాపాడుకుంటూ వస్తున్న మన పార్టీ 48 ఏళ్లు పూర్తి చేసుకుని 49 సంవత్సరంఅడుగుపెడుతోందని తెలిపారు. వచ్చే ఏడాది అన్నాడీఎంకే పార్టీ స్వర్ణోత్సవం జరుపుకోనుందని పేర్కొన్నారు. ఈ ఏడాది మనం చేసే కార్యక్రమాలన్నీ స్వర్ణోత్సవాల ప్రారంభంగా ఉండాలని ప్రేమ పూర్వకంగా కోరుకుంటున్నామని తెలిపారు. పురట్చి తలైవర్‌ ఎంజీ రామచంద్రన్‌ సేవలను ఒక్కసారి గుర్తుచేసుకోవాలని చెప్పారు. అన్నాదురై మరణం తరువాత ఏర్పడిన ప్రభుత్వం, కొత్తగా పార్టీ పగ్గాలు చేపట్టిన వ్యక్తి ద్రవిడ పార్టీ లక్ష్యాలను విస్మరించి స్వప్రయోజనాలు, అధికారానికి వాడుకున్నారని తెలిపారు.  (కాంగ్రెస్‌ మునిగే నౌక అని తెలిసినా.. : ​కుష్బూ)

ఇలాంటి దుష్టశక్తుల చేతిలో చిక్కుకున్న రాష్ట్రాన్ని కాపాడేందుకే 1972 అక్టోబర్‌ 17వ తేదీన అన్నాడీఎంకే ఆవిర్భవించిందని, అధికారాన్ని చేపట్టి ఎంజీఆర్‌ నేతృత్వంలో ప్రజావసరాలను తీర్చిందని తెలిపారు. తమిళనాడులో సరికొత్త చరిత్రను సృష్టించిందని చెప్పారు.  ఆయన తరువాత పార్టీ పగ్గాలు చేపట్టిన జయలలిత ఎంజీఆర్‌ చూపిన మార్గంలో ప్రజల మన్ననలు పొందారు. వారిద్దరిని ఆదర్శంగా తీసుకుని అందరం ముందుకు సాగుదాం. పార్టీ ప్రస్తానంలో 2021 ఎంతో ముఖ్యమైంది. పార్టీ స్వర్ణోత్సవ ఏడాదిలో అన్నాడీఎంకేను అధికార పీఠంపై కూర్చోబెట్టి చరిత్ర సృష్టిద్దాం. స్వర్ణోత్సవం దిశగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిద్దాం..’ అంటూ ఆ లేఖలో పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తలు