బీజేపీ దూకుడు.. నష్టం తప్పదన్న సీనియర్‌ నేత

2 Jun, 2022 17:47 IST|Sakshi

సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఇటీవల బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ వైఖరి మున్ముందు ప్రతిపక్ష అన్నాడీఎంకేకు నష్టం కలిగించే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా అన్నాడీఎంకే సీనియర్‌ నేత పొన్నయ్యన్‌ సమన్వయ కమిటీ పెద్దలను తాజాగా హెచ్చరించారు. కమలనాథులపై ఎదురు దాడికి సిద్ధం కాకుంటే, భవిష్యత్‌లో నష్టం తప్పదన్న ఆందోళనను పార్టీ సమావేశంలో వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా డీఎంకే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా కమలనాథులు దూకుడు పెంచారు.

చిన్న అస్త్రం దొరికి నా, దానిని బూతద్దంలో పెట్టేస్తున్నారు. నిరసనలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. మంగళవారం కూడా పెట్రోల్, డీజిల్‌ ధరలపై రాష్ట్ర ప్రభుత్వ పన్ను వాటా తగ్గించాలనే నినాదంతో బీజేపీ వర్గాలు ఆందోళనలు నిర్వహించాయి. తమపై కేసులు నమోదు చేసినా తగ్గేది లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈమేరకు బుధవారం నుంచి ఈనెల 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలపై బీజేపీ అధ్యక్షుడు అన్నామలై దృష్టి పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల పాలనలో విజయాలను, పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లే విధంగా ముందుకెళ్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాన ప్రతి పక్షంగా అన్నాడీఎంకే వైఫల్యం చెందిందనే ప్రచారాన్ని కొన్ని వర్గాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతం చేశాయి. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకే సమన్వయ కమిటీ సమావేశంలో ఆ పార్టీ సీనియర్‌ నేత పొన్నయ్యన్‌ చేసిన వ్యాఖ్యలు, హెచ్చరికల వీడియో బుధవారం వెలుగులోకి వచ్చింది.  

రాష్ట్రవ్యాప్తంగా చర్చ.. 
నగర పాలక సంస్థల ఎన్నికల సమయంలో తమిళనాడు బీజేపీకీ అన్నాడీఎంకే కటీఫ్‌ చేప్పిన విషయం తెలిసిందే. అయితే, జాతీయ స్థాయిలో మాత్రం సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో సాగుతున్న వ్యవహారాలపై పొన్నయ్యన్‌ సమన్వయ కమిటీ సమావేశంలో పొన్నయ్యన్‌ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. తమిళనాడులో అన్నాడీఎంకేను వెనక్కి నెడుతున్నారనే ప్రచారం ఊపందుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అప్రమత్తంగా వ్యవహరించకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించడం గమనార్హం. తమిళ ప్రజలపై బీజేపీకి చిత్తశుద్దిలేదని, వారి రెండు నాల్కల ధోరణి, భిన్న వాదనల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అన్నాడీఎంకేపై ఉందన్నారు.

వీడియో వైరల్‌ నేపథ్యంలో పొన్నయ్యన్‌ను మీడియా ప్రతినిధులు సందించిన ప్రశ్నలకు ప్రత్యేకంగా సమాధానాలు ఇచ్చారు. కావేరి, పాలారు, ముల్‌లై పెరియార్‌ వంటి అంశాలపై, తమిళ ప్రజల సంక్షేమంపై  బీజేపీ నేతలు పెదవి విప్పడం లేదన్నారు. బీజేపీ సిద్ధాంతం వేరు, తమ సిద్ధాంతం వేరు అని గుర్తు చేశారు. తమిళులపై హిందీని వారు బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, నీట్‌ను బలవంతంగా రుద్దేశారని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో తమిళ ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత గురించి తాను సమావేశంలో వ్యాఖ్యలు చేసినట్టు వివరించారు. వాస్తవాలు ప్రజలకు తెలియ జేయకుంటే, ప్రచారాలకు బలం చేకూరినట్టే అని హెచ్చరించారు. 

చిన్నమ్మకు ఆహ్వానం 
ఈ చర్చ  ఓ వైపు ఉంటే,  మరోవైపు బీజేపీ శాసన సభా పక్ష నేత నయనార్‌ నాగేంద్రన్‌ పుదుకోట్టైలో మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు మరింత హాట్‌ టాపిక్‌ అయ్యాయి. చిన్నమ్మ శశికళను బీజేపీలోకి ఆయన ఆహ్వానించారు. అన్నాడీఎంకేలోకి ఆమె వెళ్తే ఆ పార్టీ బల పడుతుందన్నారు. అదే తమ పార్టీలోకి వస్తానంటే, ఆహ్వానించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ఆమె బీజేపీలో చేరితే తమకు పక్క బలంగా ఉంటారని అభిప్రాయపడ్డారు.

చదవండి: Divyavani On Chandrababu Naidu: నరకం చూపిస్తారా.. కన్నీళ్లు పెట్టుకున్న దివ్యవాణి

మరిన్ని వార్తలు