Tamil Nadu: పన్నీరుకు షాక్‌.. పళనిస్వామికే అన్నాడీఎంకే పగ్గాలు

3 Sep, 2022 08:36 IST|Sakshi

అన్నాడీఎంకే బాధ్యతలు పళనిస్వామి గుప్పెట్లోకి చేరాయి. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళని ఎంపికకు పరోక్షంగా శుక్రవారం మద్రాసు హైకోర్టు ద్విసభ్య బెంచ్‌ పచ్చ జెండా ఊపింది. జూలై 11న జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశాన్ని  ఆమోదించింది. సింగిల్‌ బెంచ్‌ విధించిన స్టేను రద్దు చేసింది. దీంతో పళని మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. కాగా ద్విసభ్య బెంచ్‌ తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీకోర్టులో అప్పీలుకు వెళ్లనున్నామని పన్నీరు సెల్వం ప్రకటించారు. 

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో పన్నీరు సెల్వం, పళనిస్వామి మధ్య రాజకీయ చదరంగం కొనసాగుతోంది. జూలై 11వ తేదీ జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం ద్వారా పళనిస్వామి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. దీనిని వ్యతిరేకిస్తూ పన్నీరు సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌ను గత నెల న్యాయమూర్తి జయచంద్రన్‌ బెంచ్‌ విచారించింది. సర్వసభ్య సమావేశానికి సింగిల్‌ బెంచ్‌ స్టే విధించింది.

జూన్‌ 23వ తేదీకి ముందు అన్నాడీఎంకేలో ఉన్న పరిస్థితులు కొనసాగే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పళని స్వామి శిబిరానికి చెక్‌ పెట్టే విధంగా పన్నీరుసెల్వం దూకుడు పెంచారు. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ, ఆమె ప్రతినిధి దినకరన్‌ను కలుపుకుని ముందుకు సాగేందుకు తగ్గ వ్యూహాలకు పదును పెట్టారు.  

అడియాసే.. 
పన్నీరు ఆశలన్నీ ప్రస్తుతం ఆవిరయ్యాయి. సింగిల్‌ బెంచ్‌ విధించిన స్టేకు వ్యతిరేకంగా పళనిస్వామి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. న్యాయమూర్తులు దురైస్వామి, సుందర మోహన్‌ బెంచ్‌ ఈ పిటిషన్‌పై శుక్రవారం తీర్పు వెలువరించింది. పళనిస్వామి తరఫు న్యాయవాది ఇన్బదురై బలమైన వాదనలను కోర్టు ముందు ఉంచారు. అన్నాడీఎంకే నిబంధనలకు అనుగుణంగానే జూలైన 11న సర్వసభ్య సమావేశం జరిగిందని వివరించారు.

జూన్‌ 23వ తేదీ జరిగిన సమావేశంలో జూలై 11న జరిగే సమావేశం గురించి ప్రిసీడియం చైర్మన్‌ ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఈ సమయంలో పన్నీరుసెల్వం అదే వేదికపై ఉన్నారని, అలాంటప్పుడు ఈ సమావేశం గురించి సమాచారం లేదని చెప్పడం శోచనీయమని పేర్కొన్నారు. వీటిని ద్విసభ్య బెంచ్‌ పరిగణనలోకి తీసుకుంది. 128 పేజీలతో కూడిన తీర్పును న్యాయమూర్తులు వెలువరించారు. 
చదవండి: పొలిటికల్‌ గేమ్‌లో ప్లాన్‌ ఛేంజ్‌.. టీఆర్‌ఎస్‌కు షాకిచ్చిన బీజేపీ!

తీర్పుతో పళని శిబిరంలో సంబరాలు 
సింగిల్‌ బెంచ్‌ విధించిన స్టేను ద్విసభ్య బెంచ్‌ రద్దు చేసింది. జూలై 11న జరిగిన సర్వ సభ్య సమావేశానికి ఆమోదం తెలిపింది. దీంతో పళని శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. చెన్నైలో ఎంజీఆర్‌ యువజన విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ సునీల్‌ నేతృత్వంలో స్వీట్లు పంచుకుని బాణాసంచాతో హోరెత్తించారు. పళని, దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. పళని మద్దతుదారులు జయకుమార్, ఆర్‌బీ ఉదయకుమార్, వైగై సెల్వం, ప్రిసీడియం చైర్మన్‌ తమిళ్‌ మగన్‌ హుస్సేన్‌ తదితరులు మీడియా ముందుకు వచ్చారు.

ఇది చారిత్రక తీర్పుగా పేర్కొన్నారు. పన్నీరు సెల్వంను అన్నాడీఎంకే నుంచి ఇప్పటికే తొలగించామని, ఆయనకు పార్టీలో చోటు లేదని స్పష్టం చేశారు.  మూడు నెలల్లో మరోమారు పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి పళనిస్వామిని పూర్తి స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటామని ప్రకటించారు. కోర్టు తీర్పు ఏకనాయకత్వానికి ఆమోదముద్ర వేసిందని హర్షం వ్యక్తం చేశారు.  

తాత్కాలికం 
ద్విసభ్య బెంచ్‌ తీర్పుతో పళనిస్వామి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. ఇది పన్నీరు సెల్వం శిబిరానికి షాక్‌ గా మారింది.  దీంతో సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్‌ దాఖలు చేయడానికి పన్నీరు సెల్వం నిర్ణయించారు. ఇదిలా ఉండగా, ద్విసభ్య బెంచ్‌ తీర్పు తాత్కాలికంగా మారేనా అన్న చర్చ నెలకొంది. ఇందుకు కారణం న్యాయమూర్తి జయచంద్రన్‌ నేతృత్వంలోని సింగిల్‌ బెంచ్‌లో అన్నాడీఎంకే సమన్వయ కమిటీ వ్యవహారం ప్రధాన కేసుగా విచారణలో ఉండటమే. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ రద్దు చేశారా.? కాలం చెల్లిందా..? అన్న వ్యవహారాలపై ఈ బెంచ్‌లో వాదనలు జరగాల్సి ఉంది.

కేవలం సింగిల్‌ బెంచ్‌ విధించిన స్టేను మాత్రమే ద్విసభ్య బెంచ్‌ రద్దు చేసింది. అయితే, సింగిల్‌ బెంచ్‌లో మున్ముందు  ప్రధాన కేసు విచారణ ఎలాంటి మలుపులకు దారి తీస్తాయో, తుది వాదనలు ఎలా ఉంటాయో  అన్నది వేచి చూడాల్సిందే. దీనిపై పన్నీరు శిబిరం నేత వైద్యలింగం స్పందిస్తూ ఈ తీర్పు తాత్కాలికమేనని.. సుప్రీంకోర్టులో తమ న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.  

తిరువళ్లూరులో..
పట్టణంలో పళనిస్వామి మద్దతుదారులు బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం ఎంజీఆర్, అన్నాదురై విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి రమణ, పార్టీ నేతలు వెంకటేషన్, బాబు, ఎయిళరసన్, సుధాకర్, మాధవన్‌ పాల్గొన్నారు.  

తిరుత్తణి: హైకోర్టు తీర్పుతో అన్నాడీఎంకే శ్రేణులు తిరుత్తణిలో సంబరాలు చేసుకున్నారు. పట్టణ కార్యదర్శి సౌందర్‌రాజన్‌ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండు వద్ద బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. పళ్లిపట్టు మండల కార్యదర్శి టీడీ.శ్రీనివాసన్, నాయకులు కుప్పుస్వామి, త్యాగరాజన్,  జయశేఖర్‌బాబు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు