TS: ‘కోర్‌’ స్థానంలో పీఏసీ

13 Sep, 2021 03:10 IST|Sakshi
మాణిక్యం ఠాగూర్‌, షబ్బీర్‌ అలీ

చైర్మన్‌తో పాటు కొత్తగా కన్వీనర్‌ను నియమించిన ఏఐసీసీ 

చైర్మన్‌గా మాణిక్యం ఠాగూర్, కన్వీనర్‌గా షబ్బీర్‌ అలీ 

ప్రాధాన్యత తగ్గిందని భావిస్తున్న నేతల శిబిరాల్లో ఉత్సాహం!     

సాక్షి, హైదరాబాద్‌/ న్యూఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించి మరో కొత్త కమిటీ ఏర్పాటయ్యింది. గతంలో ఉన్న టీపీసీసీ కోర్‌ కమిటీ స్థానంలో రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)ని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ కమిటీ చైర్మన్‌గా మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ కన్వీనర్‌గా నియమితులయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, నేతలు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, కె.జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, జీవన్‌రెడ్డి, రేణుకాచౌదరి, పి.బలరాం నాయక్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డి. శ్రీధర్‌బాబు, పొడెం వీరయ్య, అనసూయ (సీతక్క), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలతో కూడిన ఈ కమిటీ తక్షణమే అమలులోకి వస్తుందని ప్రకటనలో తెలిపారు. 

కన్వీనర్‌ నియామకంపై చర్చ  
కమిటీ కూర్పులో తేడా కనిపించకపోయినా ఉన్నట్టుండి అధిష్టానం నుంచి ప్రకటన రావడం, ఈ కమిటీలో కొత్తగా కన్వీనర్‌ హోదా కల్పించడంపై గాంధీభవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో ఉండే కోర్‌ కమిటీల్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి చైర్మన్‌గా, టీపీసీసీ అధ్యక్షుడితో పాటు ఇతరులు సభ్యులుగా ఉండేవారు. కానీ, తాజాగా నియమించిన పీఏసీకి కొత్తగా కన్వీనర్‌ను నియమించి ఆ బాధ్యతలను మొదటి నుంచీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి మద్దతుగా నిలుస్తోన్న మాజీ మంత్రి షబ్బీర్‌ అలీకి అప్పగించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కన్వీనర్‌ హోదాలో షబ్బీర్‌ అలీ ఏం చేస్తారనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.  

ముఖ్య నేతలకు ఉపశమనం 
ఈ కమిటీ ఏర్పాటు ద్వారా కాంగ్రెస్‌ శ్రేణులకు ఆ పార్టీ అధిష్టానం మరో సంకేతాన్ని కూడా పంపిందన్నది రాజకీయ వర్గాల భావనగా కనిపిస్తోంది. రేవంత్‌ పీసీసీ అధ్యక్షుడు అయ్యాక పార్టీ వ్యవహారాల్లో గతంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతల చరిష్మా కొంత మేర తగ్గిందని, అయితే తాజా కమిటీలో ముఖ్యులందరికీ స్థానం కల్పించడంతో ఆయా శిబిరాల్లో కొత్త జోష్‌ వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పలు సీనియర్లకు కూడా పార్టీ ప్రాధాన్యత ఇస్తోందనే సంకేతాలను అధిష్టానం దీనిద్వారా పంపిందని అంటున్నారు. గతంలో కోర్‌ కమిటీలో ఉన్నట్టే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు ఏఐసీసీ కార్యదర్శులు, ఇన్‌చార్జి కార్యదర్శులు, ఏఐసీసీ ప్రకటించిన ఇతర కమిటీల చైర్మన్లకు తాజా కమిటీలో సైతం ప్రాతినిధ్యం లభించడంతో ఇప్పుడు కాంగ్రెస్‌లో అసలు ఆట మొదలయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు