ఎన్నికల పద్ధతిలో కాంగ్రెస్‌కు కొత్త చీఫ్‌!

2 Jan, 2021 10:54 IST|Sakshi

ఎన్నిక ప్రక్రియపై ఏఐసీసీ మల్లగుల్లాలు 

వచ్చే వారం సీనియర్ల భేటీ 

సాక్షి, న్యూఢిల్లీ: వరుసగా ఎదురుదెబ్బలు తింటూ, క్షేత్రస్థాయిలో పట్టుకోల్పోతున్న పార్టీని గాడిలో పెట్టేందుకు నూతన జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవటానికి కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఇందుకోసం ఏఐసీసీ సమావేశాన్ని ఏర్పాటు చేయడంపై చర్చించేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు వచ్చే వారం సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహించిన రాహుల్‌ గాంధీ 2019 జూలైలో పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. రాహుల్‌ రాజీనామా తర్వాత 2019 ఆగస్టు నుంచి పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడి ఎంపిక, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం తదితరాలపై ఇటీవల కాలంలో పార్టీలోని పలువురు సీనియర్లు ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలంటే సమూల మార్పు జరగాల్సిందే అంటూ 23 మంది నాయకులు సోనియా గాంధీకి లేఖ రాశారు. కాంగ్రెస్‌ పార్టీలోని అట్టడుగు స్థాయి నుంచి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ వరకు అన్ని స్థాయిల్లో నాయకులను మార్చాలంటూ వీరు డిమాండ్‌ చేశారు. 

ఎన్నిక ద్వారానే ఎంపిక 
పార్టీలో నెలకొన్న అసంతృప్తికి చెక్‌ పెట్టేందుకు జీ–23 లోని పలువురు కీలక నాయకులతో పాటు, పార్టీ సీనియర్లు కొందరితో గత డిసెంబర్‌లో సోనియాగాంధీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసి అందరి అభిప్రాయాలను తీసుకున్నారు. సమావేశంలో కొందరు నాయకులు రాహుల్‌ గాంధీనే పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరారు. అయితే పార్టీ అధ్యక్ష ఎంపికను ఎన్నికల ద్వారా నిర్వహించాలని రాహుల్‌ గాంధీ, సోనియాగాంధీ నాయకులకు సూచించారు. ఈ క్రమంలో వచ్చేవారం మరోసారి సీనియర్లతో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ భేటీ అవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ఏఐసీసీ సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించాలన్నదానిపై ఒక నిర్ణయం తీసుకొనే అవకాశాలున్నాయని నాయకులు పేర్కొన్నారు. ఒకవేళ రాహుల్‌గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించకపోతే, ఆ స్థానంలో ఎవరిని ఎన్నుకోవాలనే అంశంపైన కూడా చర్చలు జరుతాయని పార్టీ వర్గాలు వివరించాయి. ఇప్పటికే ఏఐసీసీ సభ్యులకు సంబంధించిన ఐడీకార్డుల డిజిటలైజేషన్‌ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని, అధ్యక్ష ఎన్నిక ప్రక్రియను ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించే అంశాన్ని కాంగ్రెస్‌ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం.  

మరిన్ని వార్తలు