ఇంకెంత ఆలస్యం..?

11 Feb, 2023 03:38 IST|Sakshi

బీబీనగర్‌ ఎయిమ్స్‌ నిర్మాణంలో జాప్యంపై  ఎంపీ ఉత్తమ్‌ ఆగ్రహం 

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఎప్పుడు నెరవేరుస్తారని కేంద్రానికి ప్రశ్న 

సాక్షి, న్యూఢిల్లీ: బీబీ నగర్‌ ఎయిమ్స్‌ పూర్తిపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు దాటవేసే ధోరణిలోనే సమాధానాలు చెప్తోందని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 లో ఇచ్చిన హామీల్లో భాగంగా పదేళ్లలో బీబీ నగర్‌ ఎయిమ్స్‌ను పూర్తి చేసే ప్రక్రియలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన బీబీనగర్‌ ఎయిమ్స్‌ నిర్మాణాన్ని ఎప్పుడు పూర్తిచేస్తారో చెప్పాలని కేంద్రాన్ని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు.  బీబీనగర్‌ ఎయిమ్స్‌ నిర్మాణంపై శుక్రవారం లోక్‌సభలో తాను అడిగిన ప్రశ్నకు  కేంద్ర వైద్యశాఖ సహాయ మంత్రి డా.భారతి ప్రవీణ్‌ పవార్‌ ముక్తాయింపు సమాధానం ఇచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎప్పటికప్పుడు వాయిదాలే.. 
బీబీనగర్‌ నిర్మాణం పూర్తిపై లోక్‌సభలో 2020 సెప్టెంబర్‌ 18న అడిగిన ప్రశ్నకు 2022 సెప్టెంబర్‌ కల్లా పూర్తి చేస్తామని కేంద్రం సమాధానం ఇచ్చిందన్నారు. ఆ తర్వాత  2022 ఫిబ్రవరి 4న మరొక ప్రశ్నకు సమాధానంగా, 2023 నవంబర్‌ కల్లా పూర్తి చేస్తామని కేంద్రం గడువు పొడిగించిందని విమర్శించారు. కొన్ని నెలల తర్వాత 2022 జూలై 22న తాను అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో 2025 జనవరిలోగా బీబీనగర్‌ ఎయిమ్స్‌ పూర్తి చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారని ఎంపీ ఉత్తమ్‌ తెలిపారు.

తాజాగా శుక్రవారం లోక్‌సభలో అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా టెండర్‌ ఇచ్చామని, నిర్మాణం మొదలైందని మాత్రమే చెప్పారు కానీ ఎప్పటికల్లా నిర్మాణాన్ని పూర్తి చేస్తామో చెప్పకుండా కేంద్రం తప్పించుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా బీబీనగర్‌ ఎయిమ్స్‌కు మంజూరైన రూ.1,028 కోట్లలో కేవలం రూ.29.28 కోట్లు మాత్రమే కేంద్రప్రభుత్వం విడుదల చేసిందని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు.    

గత జూలైలో ఎయిమ్స్‌ నిర్మాణానికి టెండర్‌ 
గత ఏడాది జూలైలో బీబీనగర్‌లో ఎయిమ్స్‌ నిర్మాణానికి టెండర్‌ పిలిచామని కేంద్ర వైద్యశాఖ సహాయమంత్రి డాక్టర్‌ భారతి ప్రవీణ్‌ పవార్‌ తెలిపారు. అనంతరం ఎయిమ్స్‌ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.  

మరిన్ని వార్తలు