నన్ను 12 సార్లు అడ్డుకున్నారు: ఒవైసీ

13 Jan, 2021 15:16 IST|Sakshi
ఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ(ఫైల్‌ ఫొటో)

లక్నో: రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సుహెల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ(ఎస్‌బీఎస్‌పీ)తో కలిసి పోటీ చేస్తామని ఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తెలిపారు. ఎస్‌బీఎస్‌పీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌తో కలిసి భాగీధరి సంకల్‌‍్ప మోర్చా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నామని, ప్రతి జిల్లాను సందర్శించి క్షేత్రస్థాయి కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తామని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌ ప్రజలు రాజకీయ ప్రత్యామ్నాయాల కోసం వేచి చూస్తున్నారన్న ఒవైసీ... సమాజ్‌వాదీ వంటి పార్టీలు సోషల్‌ మీడియా, టీవీకే పరిమితమవుతాయంటూ ఎద్దేవా చేశారు. 

ఇక బీజేపీ ఏజెంట్‌గా తనపై చౌకబారు ఆరోపణలు చేసే వారికి బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే సమాధానం చెప్పాయన్నారు. అక్కడ తాము సెక్యులర్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌లో భాగంగా బరిలోకి దిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఆజంఘర్‌, జాన్‌పూర్‌ నియోజకవర్గాల్లో ఒవైసీ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బీఎస్‌ఎమ్‌ అధినేత రాజ్‌భర్‌ను కలిసేందుకు ఇక్కడికి వచ్చాను. ఎంఐఎం, బీఎస్‌ఎంలో అంతర్భాగమే. శాసన సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ పూర్తైన తర్వాత సమావేశాలు ఏర్పాటు చేస్తాం. నాకు ఇంతటి సాదర స్వాగతం లభించడం ఆనందంగా ఉంది’’ అంటూ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: ఒవైసీ కీలక నిర్ణయం.. ఆ పార్టీతో జట్టు!

12 సార్లు అడ్డుకున్నారు: ఒవైసీ
ఎస్పీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌పై విమర్శలు ఎక్కుపెట్టిన ఒవైసీ.. ‘‘అఖిలేశ్‌ ప్రభుత్వ హయాంలో నన్ను రాష్ట్రానికి రానివ్వకుండా 12 సార్లు అడ్డుకున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనకుండా చేశారు. 28 సార్లు అనుమతి నిరాకరించారు. ఆయన పార్టీకి క్షేత్రస్థాయిలో అసలు కార్యకర్తలే లేరు. కేవలం సామాజిక మాధ్యమాలు, టెలివిజన్లలో మాత్రమే ఆ పార్టీ నేతలు కనిపిస్తారు. మేమెవరికీ ఏజెంట్లం కాదు’’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.

కాగా దేశ వ్యాప్తంగా తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకొనేందుకు ఎంఐఎం ప్రయత్నాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కేవలం హైదరాబాద్‌లోని పాతబస్తీకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ సత్తా చాటేందుకు పతంగి పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా.. వచ్చే ఏడాది జరుగనున్న పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు శాసన సభ ఎన్నికలు, 2022లో జరుగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఒవైసీ ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ ముఖ్యనేతలతో మంతనాలు జరుపుతున్నారు.(చదవండిమజ్లిస్‌ విస్తరణ వ్యూహం)

మరిన్ని వార్తలు