హైదరాబాద్‌పై బీజేపీ సర్జికల్‌ స్ట్రైక్‌.. అసదుద్దీన్‌ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

27 Aug, 2022 18:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, హైదరాబాద్‌పై బీజేపీ కుట్ర చేసిందని ఎఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ధ్వజమెత్తారు. మత కల్లోలాలు సృష్టించేందుకు హైదరాబాద్‌పై బీజేపీ సర్జికల్‌ స్ట్రైక్‌ చేపట్టిందని మండిపడ్డారు. బీజేపీ సర్జికల్‌ స్ట్రైక్‌ను హైదరాబాదీలు భగ్నం చేశారని అన్నారు. పాతబస్తీలో కొంతమంది ఆందోళన చేశారని, అందులో ఏం తప్పు ఉందని ప్రశ్నించారు. పోలీసులపై ఎవరూ రాళ్లు విసరలేదని స్పష్టం చేశారు.  కొందరిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, వాళ్లను విడిపిస్తే తప్పేముందని నిలదీశారు. రాజాసింగ్‌కు ఇప్పటికీ బీజేపీ పెద్దల మద్దతు ఉందన్నారు. 

కాగా గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పీడీయాక్ట్పై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మసీదుల్లో ప్రార్థనల అనంతరం ఎలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదని ముస్లింలకు శుక్రవారం ఎంఐఎం అధినేత అసదుద్దిన్‌ ఒవైసీ సూచించారు. ప్రశాంతంగా ప్రార్ధనలు చేసుకోవాలని సూచించారు. ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ఉండాలంటే ప్రార్థనల అనంతరం అందరూ ప్రశాంతంగా తమ ఇళ్లలోకి వెళ్లాలని తెలిపారు. ఓవైసీ, మత పెద్దల పిలుపుతో  ప్రశాంతంగా ప్రార్ధనలు ముగిశాయి.
చదవండి: తెలంగాణలో నయా నిజాం వచ్చారు.. కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన జేపీ నడ్డా 

మరిన్ని వార్తలు