అనూహ్య నిర్ణయం తీసుకున్న​ అఖిలేష్‌...రాజుకుంటున్న కుటుంబ కలహాలు

30 Mar, 2022 10:35 IST|Sakshi

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. బాబాయ్‌ శివపాల్ యాదవ్‌కు దగ్గరైన కొందరు నాయకులపై వేటు వేశాడు అఖిలేష్‌. దీంతో శివపాల్‌ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘాజీపూర్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా.. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పని చేసిన మాజీ ఎమ్మెల్యే, కైలాష్ సింగ్, ఘాజీపూర్ జిల్లా మాజీ పంచాయతీ అధ్యక్షుడు విజయ్ యాదవ్ సహా పలువురు పార్టీ సభ్యులను బహిష్కరించారు.

ఇదిలా ఉండగా, పార్టీ మిత్రపక్షాలైన అప్నాదళ్ (కె), సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బిఎస్‌పి), రాష్ట్రీయ లోక్ దళ్‌ (ఆర్‌ఎల్‌డి) నాయకులతో యాదవ్ మంగళవారం సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశానికి జస్వంత్ నగర్ నుంచి ఎస్పీ టికెట్ పై పోటీ చేసిన అఖిలేష్ బాబాయ్‌ , ఎమ్మెల్యే, ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ (పీఎస్పీ) నేత శివపాల్ యాదవ్ హాజరుకాలేదు. ఆయనతోపాటు  అప్నాదళ్ (కె) నేత పల్లవి పటేల్ కూడా సమావేశానికి హాజరు కాలేదు.

అఖిలేష్ యాదవ్‌తో జరిగిన సమావేశానికి ఎస్‌బిఎస్‌పి అధినేత ఓం ప్రకాష్ రాజ్‌భర్, ఆర్‌ఎల్‌డి లెజిస్లేచర్ పార్టీ నాయకుడు రాజ్‌పాల్ బలియన్ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఓటిమికి గల కారణాలు, సామాన్యుడి సమస్యలు, నిరుద్యోగం తదితర విషయాల పై చర్చించారు. అయితే సమావేశానికి శివపాల్ యాదవ్ గైర్హాజరు కావడంపై ప్రశ్నించగా.. ఎలాంటి గొడవలు లేవని.. అందరం కలిసి ఉన్నామని అఖిలేష్‌ చెప్పారు.

(చదవండి: బీజేపీపై ఉమ్మడి పోరు )

మరిన్ని వార్తలు