యూపీలో ‘పొత్తు’ పొడుపులు!

25 Nov, 2021 05:37 IST|Sakshi

అఖిలేష్‌తో ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ భేటీ

ఆసక్తికరంగా ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలు

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ‘పొత్తు’ రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. ప్రధాన రాజకీయపక్షాలైన బీఎస్సీ, కాంగ్రెస్‌లతో పొత్తు ఉండదని, చిన్నపార్టీలతో జట్టుకడతామని ఇదివరకే ప్రకటించిన సమాజ్‌వాది పార్టీ అధ్యక్షడు అఖిలేష్‌ యాదవ్‌ ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే జయంత్‌ చౌదరి నేతృత్వంలో రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ)తో ఒక అవగాహనకు వచ్చిన అఖిలేష్‌ గతంలో ఎన్డీయేతో ఉన్న సుహల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ (ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌)నూ తమవైపునకు తిప్పేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా బుధవారం అఖిలేష్‌ లక్నోలో ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. ఎస్సీ– ఆప్‌ పొత్తుపై ఇప్పుడే ఏమీ చెప్పలేని పరిస్థితి ఉన్నప్పటికీ... భవిష్యత్తు పరిణామాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయని చెప్పవచ్చు.

ఆప్‌కు యూపీలో పెద్దగా బలం లేనప్పటికీ... కేజ్రీవాల్‌ అండ లభిస్తే నైతికంగా బలం చేకూరినట్లవుతుందనేది పరిశీలకుల అంచనా. మరోవైపు అఖిలేష్‌ యాదవ్‌ బుధవారం అప్నాదళ్‌ (కె) నాయకురాలు కృష్ణ పటేల్‌తో భేటీ అయ్యారు. పొత్తుకు సంబంధించి ఒప్పందం కుదిరిందని ఆమె తెలిపారు. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో పొత్తులో భాగంగా అప్నాదళ్‌ (కె) 20–25 సీట్లను ఆశిస్తోంది.

కృష్ణ పటేల్‌ కూతురు అనుప్రియా పటేల్‌కు చెందిన అప్నాదళ్‌(ఎస్‌) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో భాగస్వామి. ఆ పార్టీకి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, అనుప్రియతో కలిపి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. సామాజికంగా వెనుకబడిన వర్గమైన ‘కుర్మీ’లకు ప్రధానంగా అప్నాదళ్‌ ప్రాతినిధ్యం వహిస్తోంది. తల్లి కృష్ణ పటేల్‌తో పొత్తుపెట్టుకొని... ఆమెకు సముచిత గౌరవమిస్తే కుర్మీ ఓట్లలో చీలిక తేవొచ్చనేది అఖిలేష్‌ ఎత్తుగడ. యూపీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరి– మార్చి నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.

మరిన్ని వార్తలు